- పిఎంఎవైయు ఇళ్లపై శాశ్వత లోగో నిబంధనపై జాన్ బ్రిట్టాస్ ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పిఎంఎవై-యు) కింద నిర్మించిన ఇళ్లపై పథకం లోగోను శాశ్వతంగా ప్రదర్శించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను సిపిఎం రాజ్యసభ ఎంపి జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. "ఇల్లు అనేది గౌరవానికి చిహ్నం, రాజకీయ బ్రాండింగ్ కోసం ఒక ప్రకటనల బోర్డు కాదు" అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. "పేదలు గౌరవానికి అర్హులు, వారి ఇళ్ల గోడలపై శాశ్వత ప్రభుత్వ ప్రకటనలకు కాదు" అని చెప్పారు. పిఎంఎవై ఇళ్లను ప్రజా నిధులతో నిర్మిస్తారని, వాటి నిర్మాణ వ్యయంలో రాష్ట్రాలు గణనీయమైన వాటాను భరిస్తాయని పేర్కొన్నారు. "సంక్షేమాన్ని ప్రచారంగా మార్చలేం. రాజకీయ బ్రాండింగ్ కోసం గౌరవాన్ని త్యాగం చేయలేం. ఇళ్ళు కట్టండి. మనుషుల మీద ముద్రలు వేయకండి" అని బ్రిట్టాస్ అన్నారు.
కేంద్రం మార్గదర్శకాలు...
పిఎంఎవై-యు, పిఎంఎవై-యు 2.0 మార్గదర్శకాల ప్రకారం, ఈ పథకం కింద నిర్మించిన అన్ని ఇళ్లపై పథకం లోగో, లబ్ధిదారుల వివరాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం అమలులో బ్రాండింగ్ "ప్రామాణికత, పారదర్శకత"ను నిర్ధారిస్తుందని, ఇది "అంతర్గత సామాజిక తనిఖీ"గా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి గృహ యూనిట్ ముందు భాగంలో లోగో, లబ్ధిదారుని వివరాలను, వీలైతే స్థానిక భాషలో, చెక్కబడి, స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని పేర్కొంది. గౌరవం, గోప్యత, ఆత్మగౌరవం, సమాఖ్య సంబంధిత ఆందోళనల దృష్ట్యా, కేరళతో సహా పలు రాష్ట్రాలు తప్పనిసరి బ్రాండింగ్‌ను వ్యతిరేకించాయి. ఈ విధానంపై సమీక్షించబోమంటూ కేంద్రం మొండివైఖరి అవలంభించింది. లబ్ధిదారుల ఇళ్లపై బ్రాండింగ్ చేయడం వారి గౌరవానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుందని వాదిస్తూ, గత సిపిఎం నేతృత్వంలోని కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం తప్పనిసరి పిఎంఎవై లోగోను వ్యతిరేకించింది. పినరయి విజయన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.







కామెంట్‌లు (0)