mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతిభ ఒక్కటే కాదు : వైభవ్ ఎంపికపై కోచ్ వివరణ

1 రోజు క్రితం

Not just talent: Coach explains Vaibhav's selection
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 12:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోవడంతో జట్టు ఎంపికపై చర్చలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డచ్‌కేట్ స్పందించాడు.


ఐర్లాండ్‌తో రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైభవ్ అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సామర్థ్యం కలిగిన ఆటగాడేనని పేర్కొన్నాడు. అయితే జట్టులోకి రావాలంటే ఇతర ఆటగాళ్ల మాదిరిగానే నిర్దిష్ట ఎంపిక ప్రక్రియను అనుసరించాల్సిందేనని స్పష్టం చేశాడు.


"వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మూడు నెలల క్రితమే ప్రపంచకప్ విజయంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ అతను అద్భుతంగా రాణించాడు. ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లకు నమ్మకం ఇవ్వడం, వారికి తగినంత సమయం, అవకాశాలు కల్పించడం మా విధానం. వైభవ్‌ను కూడా జట్టులో చూడాలని మేము కోరుకుంటున్నాం. అయితే అతను కూడా అందరూ అనుసరించిన అదే ప్రక్రియ ద్వారా ముందుకు రావాల్సి ఉంటుంది. అతని ప్రతిభపై మాత్రం ఎలాంటి సందేహం లేదు" అని డచ్‌కేట్ వివరించాడు. సిరీస్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఈ సీజన్ ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 230కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 'మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇలాంటి అద్భుత ఫామ్‌లో ఉన్న ఆటగాడికి జట్టులో స్థానం దక్కకపోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఇక భారత జట్టు తదుపరి టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 1 నుంచి చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో అయినా వైభవ్‌కు అవకాశం లభిస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అతను ఈ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తే, భారత్ తరఫున అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జట్టు యాజమాన్యం యువ ప్రతిభకు అవకాశాలు కల్పించే విషయంలో కూడా నిర్ణీత ఎంపిక విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అసిస్టెంట్ కోచ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్