- జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ చేస్తా
- మాడుగులను పారిశ్రామికరిస్తా
-‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి- అనకాపల్లి రూరల్, కె.కోటపాడు : ‘సెప్టెంబర్ మొదటి వారంలో పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి నీళ్లను అనకాపల్లికి తీసుకొస్తాం. మాడుగులలో రూ.29 కోట్లతో 16 వేల ఎకరాలకు నీరందించేలా రైవాడ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేస్తాం. అనకాపల్లి జిల్లాను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాడుగుల ప్రాంతాన్ని పారిశ్రామీకరించి ప్రజలకు చేదోడుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తన లక్ష్యమన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం పరిధిలోని కె.కోటపాడు మండలం అలమండ కోడూరులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపికి మాడుగుల ఆది నుంచీ కంచుకోట అన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రిజర్వాయర్లను ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.23 లక్షల కోట్లతో పరిశ్రమలు తీసుకొచ్చామని, ఇందులో రూ.5 లక్షల కోట్లు అనకాపల్లి జిల్లాకే వచ్చాయని వివరించారు. రంగారెడ్డి జిల్లాను పారిశ్రామికంగా తీర్చిదిద్దినట్లే 20 ఏళ్లలో అనకాపల్లిని అంతకుమించి అభివృద్ధి చేస్తామన్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్, అల్యూమినియం కంపెనీ, గూగుల్ డేటా సెంటర్ వంటివి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇటీవల ప్రారంభించిన భోగాపురం ఎయిర్ పోర్టును ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకు రెక్కలుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను రానున్న కాలంలో ఎఐ కేంద్రంగా మారుస్తామన్నారు. కంప్యూటర్ కన్నా వెయ్యి రెట్ల శక్తితో పనిచేసే క్వాంటం కంప్యూటర్‌ను అమరావతికి తీసుకొస్తున్నామని తెలిపారు. అనకాపల్లిలో 800 ఎకరాల భూమిని సేకరించాలని, పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దామని అధికారులకు సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అడ్డంకులు సృష్టిస్తే సహించను
గత పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, దానిని గాడిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్‌సిలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంటూ పరిసరాల శుభ్రతకు కృషి చేసి స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్నీ జీరో వేస్ట్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు ‘స్వయం’ పేరుతో బ్రాండింగ్ కల్పిస్తున్నామన్నారు.
డేటా సెంటర్లకు 3.5 టిఎంసిలే
డేటా సెంటర్ల వల్ల నీళ్లు ఇంకిపోతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వీటి నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, అన్ని డేటా సెంటర్లకు కలిపి 3.5 టిఎంసిల నీరు మాత్రమే అవసరమవుతుందని తెలిపారు. ఐదు గిగావాట్ల సామర్థ్యం వస్తే లక్షలాది మంది ఎఐ నిపుణులు తయారవుతారని పేర్కొన్నారు. పరిశ్రమలతోపాటు నాలెడ్జ్ ఎకానమీకి అనకాపల్లి కేంద్రంగా మారుతుందన్నారు.
రాజకీయ చెత్తనూ కడిగేయాలి
ప్రజలు భౌతిక చెత్తను తొలగించడంతోపాటు రాజకీయ చెత్తను కూడా కడిగేయాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖ అధికారితో మాట్లాడిన చంద్రబాబు వారి పనితీరుపై ప్రశ్నలు గుప్పించారు. కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికులను, స్పీచ్ ఇచ్చిన స్కూల్ పిల్లలను సత్కరించారు. ఆహారోత్పత్తులు, కూరగాయలు, వంటకాల తదితర స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, ఎంపీలు సిఎం రమేష్, విజయ్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)