- జనరల్ సెక్రటరీగా చేబ్రోలు కృష్ణమూర్తి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎపి రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీగా చేబ్రోలు కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొప్పరాజు అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది ఆరోసారి. చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి. ఆదివారం విజయవాడలోని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో జరిగిన ఎన్నికల్లో పోటీ నామినేషన్ లేకపోవడంతో నూతన కమిటీ ఏక్రగీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పి.వి.కృష్ణారావు ప్రకటించారు. నూతన కమిటీలో మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సెక్రటరీలు ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీలుగా ఇద్దరు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎనిమిది మందితోపాటు ఒక కోశాధికారి ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం బొప్పరాజు మాట్లాడుతూ రెవిన్యూ శాఖ గౌరవాన్ని కాపాడుతూ బాధ్యతగా పనిచేస్తామని అన్నారు. రెవిన్యూ ఉద్యోగుల హక్కులు, పదోన్నతులు, సర్వీసు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తామని చెప్పారు. రికార్డుల్లో ఖచ్చితత్వం పెంచి, భూ వివాదాలను తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శకమైన, నమ్మకమైన భూ రికార్డులు అందించేందుకు కృషి చేస్తామని, అర్హులైన గ్రేడ్-2 విఆర్‌ఓలకు గ్రేడ్-I విఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉందని, దీనికోసం కృషి చేస్తామని చెప్పారు. అలాగే గ్రేడ్ 1విఆర్‌ఓలను వాటా ప్రకారం సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. విఆర్‌ఏ జీతాన్ని నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరారు. రెవిన్యూ ఉద్యోగుల ఖాళీల భర్తీ, పదోన్నతులు, పని ఒత్తిడి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక రెవిన్యూ సేవలు అందించేందుకు ప్రభుత్వానికి పూర్తి గా సహకరిస్తామని తెలిపారు.








కామెంట్‌లు (0)