- మంత్రి కొలుసు పార్థసారథి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి కొలుసు పార్ధసారధి డిమాండ్ చేశారు. టిడిపి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం విధానం ద్వారా జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకుని పాలన సాగించారని పేర్కొన్నారు. మద్యం విధానంలో సుమారు రూ.3,200 కోట్ల ముడుపులు వసూలైనట్లు బేవరేజెస్ కార్పొరేషన్ మాజి ఓఎస్డీ సత్యప్రసాద్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి నివాసంలో మద్యం విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను ఎందుకు పక్కన పెట్టారో అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయని పార్థసారథి అన్నారు. భారీ మొత్తంలో నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రవాణా రేట్ల పెంపు ద్వారా అవినీతికి అవకాశం కల్పించారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకాలు, జీతాల చెల్లింపుల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని విమర్శించారు. నాసిరకం, కల్తీ మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారనే ఆరోపణలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం విధానాన్ని మార్చలేదని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల్లో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు.







కామెంట్‌లు (0)