ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌నినోను తట్టుకునేలా తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలు

1 గంట క్రితం

tele
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విపత్తులో రైతులను ఆదుకోవడం, ధరలు తగ్గింపే ప్రధాన లక్ష్యం

- టెలికాన్ఫరెన్స్‌‌లో ముఖ్యమంత్రి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌‌ను ఆదివారం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం కేవలం రైతులపైనే కాకుండా అన్ని వ్యవస్థలపై పడే అవకాశం ఉన్నందున, తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచాలని ఆదేశించారు. గోదాముల్లో ఉన్న బియ్యం నిల్వలను పరిశీలించి, ధరలను నియంత్రించేందుకు అవసరమైన మేరకు నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని, భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలన్నారు.

పామాయిల్, కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని ఆదేశించారు. కిచెన్‌ గార్డెన్లను ప్రోత్సహించి, స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలు సాగు చేసేలా చూడాలని సూచించారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతంగా అమలు చేయగలిగితే కూరగాయల ధరలను అదుపులో ఉంచవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తున్నందున ఈ అంశంపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. పంటల బీమా చేయించినందున పంట నష్టం సంభవించినప్పుడు రైతులకు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉద్యాన పంటలకు రూ.190 కోట్లు

కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలకు అధిక ముప్పు ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించినందున ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించడంతో పాటు పశువులకు నీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అత్యధిక లోటు వర్షపాతం కనిపిస్తోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 30.84 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా, ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు 79 శాతం భూముల్లోనే సాగు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పప్పుధాన్యాల సాగు మెరుగ్గా ఉన్నప్పటికీ నూనెగింజల సాగు తక్కువగా ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రత్యామ్నాయ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

5.21 లక్షల హెక్టార్లకు విత్తనాలు, ఎరువులు

రాష్ట్రంలో 5.21 లక్షల హెక్టార్లకు పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులను సరఫరా చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీతో అందించామని చెప్పారు. ఖరీఫ్‌ ప్రత్యామ్నాయ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల కారణంగా కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటిని పంపగలుగుతున్నామని తెలిపారు. హంద్రీ–నీవా ద్వారా చివరి భూములకు నీరందించామని, ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యల వల్లే ఎల్‌నినో వంటి పరిస్థితుల్లోనూ హంద్రీ–నీవా కాలువల్లో నీరు వస్తోందన్నారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 100 రోజుల్లో హంద్రీ–నీవా కాలువల్లో నీటిని పారించగలిగామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్