- ఈ ఏడాది తొలి విడతగా రూ.3,125 కోట్ల పంపిణీ
- 46.85 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
- లింగంగుంట్లలో నిధులు విడుదల చేయనున్న సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 45,69,817 మంది భూ యజమాని రైతులు కాగా, 1,16,021 మంది అటవీ హక్కుల చట్టం కింద సాగుచేస్తోన్న రైతు కుటుంబాలున్నాయి. రూ.3,125.47 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,342.92 కోట్లు కాగా... కేంద్ర ప్రభుత్వ వాటా రూ.782.55 కోట్లుగా ఉంది. గతేడాది ఈ పథకానికి రూ.8,985.41 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.6,560.18 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2425.23 కోట్లు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలవుతోన్న ఈ పథకంతో అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.20 వేల ఆర్థికసాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రూ.6 వేలు సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. ఈ ఏడాది తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పిఎం కిసాన్ కింద కేంద్రం రూ.2 వేలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు జమ చేయనున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11:55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12:50 గంటల నుంచి 1:20 గంటల వరకు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 2:15 గంటల నుంచి 3:45 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 3:50 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల నుంచి బయలుదేరి రాత్రి 6:20 గంటలకు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.









కామెంట్‌లు (0)