- ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంపై మాజీ మహిళా మావోయిస్టుల ఆరోపణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మాజీ మహిళా మావోయిస్టులతో నిర్వహించిన ర్యాంప్ వాక్ వివాదాస్పదంగా మారింది. టైలరింగ్‌లో శిక్షణ ఇస్తామంటూ తమను సుక్మా పునరావాస కేంద్రం నుంచి రాయ్‌పూర్‌కు తీసుకెళ్లి.. అక్కడ ర్యాంప్ వాక్‌లో పాల్గొనేలా చేశారని నలుగురు మాజీ మహిళా మావోయిస్టులు ఆరోపించారు. ఆగస్టు 7న రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో మాజీ మహిళా మావోయిస్టులు ర్యాంప్ వాక్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం తమ విజయానికి, మహిళా సాధికారతకు ప్రతీకగా ప్రచారం చేసింది. అయితే ర్యాంప్ వాక్‌లో తాము స్వచ్ఛందంగా పాల్గొనలేదని మాజీ మహిళా మావోయిస్టులు తెలిపారు. టైలరింగ్ శిక్షణ కోసం రాయ్‌పూర్ తీసుకెళ్తున్నామని మాత్రమే తమకు చెప్పారని, అక్కడికి వెళ్లిన తర్వాత ర్యాంప్ వాక్‌కు శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు. ర్యాంప్ వాక్ గురించి ముందుగానే తెలిసి ఉంటే రాయ్‌పూర్‌కు వెళ్లేవాళ్లం కాదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనపై తమకు అసంతృప్తి ఉందని మీడియా ముందు వెల్లడించారు. సుక్మా పునరావాస కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారి సీమా పోయం కూడా ఈ విషయంపై స్పందించారు. మాజీ మహిళా మావోయిస్టులను టైలరింగ్ తరగతుల కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళ్తున్నట్లు మాత్రమే తనకు సమాచారం ఉందని, ర్యాంప్ వాక్ కార్యక్రమం గురించి ముందుగా తమకు తెలియదని తెలిపారు.








కామెంట్‌లు (0)