అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా కిలో ధర రూ.200 కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పొగాకు రైతులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు మార్కెట్టుకు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితులు అస్సలు ఉండకూడదన్నారు. మార్కెట్లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనికి అనుగుణంగా అన్ని పొగాకు వేలం ప్లాట్‌ఫారమ్‌లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పొగాకు కంపెనీలన్నీ తప్పనిసరిగా కొనుగోళ్లు చేపట్టాలని.. ఏ ఒక్క కంపెనీ కూడా వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. టొబాకో బోర్డ్ పరిధిలో కాకుండా, అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, టొబాకో బోర్టు ప్రతినిధులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాం నారాయణ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, డీవీబీ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, టొబాకో బోర్డ్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రొయ్యల మేత ధర కేజీకి రూ.4 తగ్గింపు
ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, మేత తయారీదారులు నష్టపోకుండా రొయ్యల మేత ప్రస్తుత ధరపై రూ.4 తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. దీనికి ఫీడ్ తయారీదారులు, ఆక్వా రైతులు అంగీకరించారు. దీంతో రొయ్యల మేత ధర కేజీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులు, ఆక్వారైతులు, మేత తయారీదారులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ధర తగ్గించడంతో పాటు, రొయ్య మేత ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని ఆదేశించారు. 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని, అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఫీడ్ ధరలతో పాటు, ప్రాసెసింగ్ విధానం, కాలుష్య నియంత్రణ పైనా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. మత్స్యశాఖ నుంచి రైతులకు అందించే రాయితీలపైనా అందరికీ అవగాహన కల్పించాలని రైతులు కోరారు. రైతులు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సోయా, ఫిష్ మీల్ వంటి ముడిసరుకు కొరత ఉందని, దేశీయంగా వీటి ధర కూడా అధికంగా ఉందని ఫీడ్ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని వివరించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వారంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని, ఈ రెండేళ్లలో రూ.1,543 కోట్ల మేర విద్యుత్ రాయితీ రూపంలో ఆక్వాసాగుకు ఇచ్చామని సిఎం తెలిపారు. చేపలు, రొయ్యల రైతులు ఇద్దరికీ తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అమెరికా ఆంక్షలతో వేరే దేశాలకు మార్కెట్ విస్తరించేలా చేశామని చెప్పారు. నాణ్యత, సర్టిఫికేషన్ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మిరప పంటకు పురుగుమందులు వినియోగించడంతో ఇటీవల ఎగుమతులను చైనా తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)