బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగుదారులకే నష్టపరిహారం చెల్లించాలి

5 గంటల క్రితం

కౌలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 12:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వారి పేరునే పంట నష్టాన్ని నమోదు చేయాలి

- ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ అందించాలి

- ఏడాది పాటు దేవాలయ భూములు కౌలుకు ఉచితంగా ఇవ్వాలి

- కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం

ప్రజాశక్తి-భీమవరం : అర్నాబ్ తుఫాన్ రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని లక్షలాది ఎకరాల్లో వరిచేలు నేటికీ నీటిలో వరి దుబ్బులు నాని పోయి కుళ్లిపోయాయని వాస్తవ సాగుదారుల పేరుని పంట నష్టాన్ని నమోదు చేసి సాగుదారులకే నష్టపరిహారాన్ని చెల్లించాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం శృంగ వృక్షం గ్రామంలో తుఫాన్ ప్రభావానికి నీట మునిగిన వరి పొలాలను బలరాం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, కౌలు రైతులు సూర్యనారాయణ రాజు, వెంకట నాగేశ్వరరావు, దుర్గారావు, నారాయణ రాజులు సమస్యలను బలరాం దృష్టికి తీసుకువచ్చారు. తుఫాను దాటికి సర్వం కోల్పోయామని చెప్పారు. పంట నష్టాన్ని యజమానుల పేరున నమోదు చేశారని వాపోయారు. ఇప్పటికే రూ. 30 వేలు ఖర్చు చేసామని వరి పంటను మాసుళ్ళు చేసిన అదనంగా ఖర్చులు అవుతాయి తప్ప పెట్టుబడులు రావని చెప్పారు. రెండు పంటలకు 30 బస్తాలు కౌలుకు చెల్లిస్తున్నామని పంట తీవ్రంగా నష్టపోయిన కౌలుకు మాత్రం చెల్లించక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు పైబడి పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. వరి చేలల్లో ఎప్పటికీ గుండెత్తు వరకు వర్షపు నీరు నిల్వ ఉందని పంట మొత్తం కుళ్లిపోయిందని పేర్కొన్నారు. రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పంట నష్టాన్ని అంచనా వెయ్యాలన్నారు. వాస్తవ సాగుదారులు, కౌలు రైతుల పేరున పంట నష్టాన్ని నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోయినా ఇన్సూరెన్స్ ను కౌలు రైతులకు అందజేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని ఇప్పటివరకు ఏ కౌలు రైతులకు ఇవ్వలేదని తక్షణం వారికే అన్నదాత సుఖీభవ , పీఎం కిసాన్ కూడా అందించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన కౌలు రైతులు పట్ల యజమానులు మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. కౌలును రద్దు చేయాలని యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కౌలు రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నష్టపోయిన సన్న చిన్న పేద కౌలు రైతులను రైతులను అందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. దాల్వాకు విత్తనాలు ఎరువులు పురుగు మందులు 50 శాతం సబ్సిడీపై ఇచ్చి ఆదుకోవాలన్నారు . వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన వ్యవసాయ రైతాంగంతో పాటు ఇతర పంటల రైతన్న కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఏడాది పాటు ఉచితంగా దేవాలయ భూములు కౌలుకు ఇవ్వాలి

దేవాలయ భూములు చేస్తున్న కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చాలా ప్రాంతాల్లో ముందస్తు కౌలు చెల్లించాలని పంట నష్టం జరిగింది చోట చెల్లించిన కౌలు తిరిగి కౌలు రైతులకు ఇవ్వాలన్నారు. మరో ఏడాది పాటు ఉచితంగా సాగు చేసుకునేందుకు దేవాలయ భూములు కౌలుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవాలయ భూముల కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు శేషాపు ఆశ్రయ, ఇతర నేతలు రైతులు ఉన్నారు .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్