బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భవిష్యత్తుకు భరోసా ఇవ్వని పరిహారం

36 నిమిషాల క్రితం

భవిష్యత్తుకు భరోసా ఇవ్వని పరిహారం
యువతకు ఉపాధి కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని పోలవరం నిర్వాసితుల డిమాండ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

యువతకు ఉపాధి కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని పోలవరం నిర్వాసితుల డిమాండ్‌


ప్రజాశక్తి-విఆర్.పురం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఇళ్లు, సాగుభూములు, జీవనాధారాన్ని కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక పరిహారం వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇవ్వలేకపోతోందని నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇచ్చే నగదు పరిహారం తాత్కాలికంగా ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే తరాల జీవనోపాధిని తీవ్ర ప్రశ్నార్థకంగా మారుస్తోందని వారు వాపోతున్నారు. ఇచ్చిన సొమ్ము ఎంత కాలం ఉంటుందని, ఇళ్ల నిర్మాణం కూడా లేకుండా ఓ.టి.ఎస్. అమలు అతివేగం చేస్తున్నారు, అక్కడకు వెళ్లిన తర్వాత ఉపాధి ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.


భూములు, ఇల్లు తీసుకొని, 13సంవత్సరాల క్రితం ప్రకటించిన పరిహారాన్ని ప్రభుత్వం ముక్కి మూలిగి ఇస్తుంది. అప్పటి ఖర్చులకు సరిపడే పరిహారం ఇప్పుడు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. గిరిజనేతరులకు ఒక్కరికి కూడా వ్యవసాయ భూమి లేకుండా చేశారు. ఇక్కడి రైతు అక్కడ కూలీగా బతకాల్సి ఉంటుందని వాపోతున్నారు.


తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులను ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన కుటుంబాల్లో ఎంతో మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక విద్యలు పూర్తి చేసిన యువత ఉన్నారు. సరైన ఉపాధి లేక వీరంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆర్థిక పరిహారం అందించి చేతులు దులుపుకోకుండా, చదువుకున్న నిర్వాసిత యువత విద్యార్హతలను బట్టి ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలతో పాటు ప్రాజెక్టు పరిధిలోని ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. నెలనెలా వచ్చే స్థిరమైన ఆదాయం మాత్రమే ఆయా కుటుంబాల పిల్లల చదువులకు, ఆరోగ్యం, భవిష్యత్తు స్థిరత్వానికి తోడ్పడుతుంది. కేవలం పరిహారంతో సమస్య తీరిపోయినట్లు కాదని, ఉద్యోగ అర్హతలు లేని యువత, మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. స్వయం ఉపాధి పొందేలా తక్కువ వడ్డీకే రుణాలు, ఆర్థిక సహాయం, వారు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ప్రత్యేక ఉపాధి విధానం రూపకల్పన చేయాలి

​రాష్ట్ర అభివృద్ధి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక ఉపాధి విధానాన్ని (స్పెషల్ ఎంప్లాయిమెంట్ పాలసీ ) రూపొందించాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్వాసిత కుటుంబాల్లో చదువుకున్న యువత, వారి వయస్సు, విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలతో ప్రత్యేక డేటాను సేకరించాలి. అర్హతను బట్టి ఉద్యోగాలు కల్పించి కుటుంబాలకు శాశ్వత జీవనోపాధికి మార్గం సుగమం చేయాలి. కేవలం పరిహారానికే పరిమితం కాకుండా పునరావాసం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిపినప్పుడే 'ఆర్ అండ్ ఆర్' ప్రక్రియకు పూర్తి అర్థం చేకూరుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిర్వాసిత యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్