బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హెచ్ఐవి రోగుల్లో అరుదైన పక్షవాతంపై డాక్టర్ యనమదల పరిశోధన

37 నిమిషాల క్రితం

డాక్టర్ యనమదల
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 8మంది రోగుల్లో ఏడుగురు కోలుకోగా..ఒకరు మృతి

ప్రజాశక్తి- కాకినాడ : హెచ్ఐవి బాధితుల్లో అరుదుగా కనిపించే నరాల సంబంధిత పక్షవాతం గిలియన్‌–బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌)పై కాకినాడకు చెందిన ఎయిడ్స్‌, సంక్రమిత వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ మురళీకృష్ణ యనమదల చేసిన పరిశోధన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. జీబీఎస్‌కు హెర్పిస్‌ కుటుంబానికి చెందిన వైరస్‌లు కారణమయ్యే అవకాశం ఉందా? అనే కొత్త కోణాన్ని ఈ పరిశోధన ప్రపంచ వైద్య రంగం ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత సేజ్‌ సంస్థ నిపుణుల సమీక్ష అనంతరం ఈ పరిశోధనా వ్యాసం 'జర్నల్‌ ఆఫ్‌ ది ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రొవైడర్స్‌ ఆఫ్‌ ఎయిడ్స్‌ కేర్‌' లో తాజాగా ప్రచురితమైంది. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక విలేకరులకు ఒక ప్రకటన విడుదల చేసారు. డాక్టర్‌ యనమదల తన వైద్య కేంద్రానికి ఆరు నెలల వ్యవధిలో వచ్చిన 139 మంది హెచ్ఐవి బాధితులను పరిశీలించగా, వారిలో 8 మందికి దీర్ఘకాలికంగా జీబీఎస్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరంతా యాంటీ రెట్రోవైరల్‌ చికిత్స (ఏఆర్టీ) తీసుకోని, వ్యాధి ముదిరిన దశలో ఉన్న బాధితులే కావడం గమనార్హం. ఈ 8 మందిలో హెర్పిస్‌ సింప్లెక్స్‌ వైరస్‌ (హెచ్‌ఎస్‌వీ) కారణంగా వచ్చే పుండ్లు, వరిసెల్లా జోస్టర్‌ వైరస్‌ (వీజెడ్‌వీ) వల్ల వచ్చే సర్పి, సైటోమెగలో వైరస్‌ (సీఎంవీ)కు సంబంధించిన దీర్ఘకాలిక విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి.అయితే బాధితులు ఇతర ఇన్ఫెక్షన్లతోనూ బాధపడుతుండటం, వనరుల పరిమితుల కారణంగా హెర్పిస్‌ వైరస్‌లను పూర్తిస్థాయిలో నిర్ధారించలేకపోయారు. దీంతో జీబీఎస్‌కు హెర్పిస్‌ వైరస్‌లే కారణమని ఈ పరిశోధన కచ్చితంగా నిర్ధారించలేకపోయింది. ఈ అంశంపై మరిన్ని నిర్ధారణాత్మక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా వెన్నుపాము ద్రవ పరీక్షలు (సీఎస్ఎఫ్‌), నరాల పనితీరు పరీక్షలు, వైరస్‌ పీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ రోగుల లక్షణాలను సమగ్రంగా పరిశీలించి జీబీఎస్‌ను త్వరగా గుర్తించడం, సకాలంలో వైద్యం అందించడం ఎంత కీలకమో ఈ అధ్యయనం స్పష్టం చేసింది. పరిశోధనలో భాగంగా గుర్తించిన 8 మంది బాధితుల్లో సకాలంలో చికిత్స అందించడంతో ఏడుగురు కోలుకోగా, ఒకరు మరణించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ యనమదల మాట్లాడుతూ హెర్పిస్‌ వైరస్‌లే జీబీఎస్‌కు కారణమని తమ పరిశోధన నిర్ధారించడం లేదని, తన వైద్య అనుభవంలో పదేపదే గమనించిన ఒక ప్రత్యేక నమూనాను అంతర్జాతీయ శాస్త్రీయ చర్చకు తీసుకురావడమే ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశమని వివరించారు. భవిష్యత్తులో ఈ అంశంపై మరిన్ని నిర్ధారణాత్మక పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్