ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 'ఆరోగ్యకర హృదయం - ఆరోగ్యకర భవిష్యత్తు' అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ హెచ్ వివిఎస్.లక్ష్మణ్ పాల్గొని గుండె ఆరోగ్యంపై వివరించారు. సమతుల్య ఆహారం, నిత్యం వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని అన్నారు. గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైందని, అత్యవసర పరిస్థితులను గుర్తించి తక్షణమే వైద్య సాయం అందించాలన్నారు. గుండె ఆగిపోయిన సమయంలో వెంటనే స్పందించి సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని, విద్యార్థులకు దానిపై ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.కె. రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, ప్రాణరక్షక నైపుణ్యాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. జంతుశాస్త్ర విభాగాధిపతి ఎం.వసంతలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై చైతన్యం తీసుకురావడం, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేలా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ఈ సదస్సులో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)