బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కక్కలపల్లి రహదారికి అడ్డంకులు తొలగింపు

29 నిమిషాల క్రితం

40e9403b-5576-473f-8801-970125786fc5.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 120 అడుగుల వెడల్పుతో రహదారి పునరుద్ధరణ చేపట్టిన అహుడా అధికారులు

ప్రజాశక్తి – అనంతపురం కార్పొరేషన్ : కక్కలపల్లి గ్రామాన్ని ఎన్‌హెచ్‌–44 జాతీయ రహదారితో అనుసంధానించే మార్గానికి అడ్డంగా నిర్మించిన గోల్డెన్ గ్లోబ్ ఇన్‌ఫ్రా సంస్థ కాంపౌండ్‌ వాల్‌ను అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడా) అధికారులు గురువారం జేసీబీతో తొలగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు.

కక్కలపల్లి గ్రామాన్ని జాతీయ రహదారితో కలిపే 40 అడుగుల రోడ్డుకు అడ్డంగా గోల్డెన్ గ్లోబ్ ఇన్‌ఫ్రా సంస్థ కాంపౌండ్‌ వాల్ నిర్మించడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో వినతిపత్రం సమర్పించారు. అక్రమంగా నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ కారణంగా జాతీయ రహదారికి వెళ్లే మార్గం మూసుకుపోయిందని, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన అహుడా అధికారులు ప్లానింగ్ ఆఫీసర్ ఇషాక్, టీపీఓ హరీష్ చౌదరి, కక్కలపల్లి గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రహదారికి అడ్డంగా నిర్మించిన కాంపౌండ్‌ వాల్‌ను తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు.

ఈ చర్యలతో 40 అడుగుల రహదారితో పాటు గోల్డెన్ గ్లోబ్ వెంచర్‌లోని 80 అడుగుల రోడ్డు, దాని పక్కనే ఉన్న మరో 40 అడుగుల రోడ్డును కలిపి మొత్తం 120 అడుగుల వెడల్పుతో రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా దక్షిణం వైపున ఉన్న కక్కలపల్లి గ్రామానికి సంబంధించి మరో 40 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్‌లోని 60 అడుగుల రోడ్డుతో అనుసంధానించారు. దీంతో గత కొంతకాలంగా రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కక్కలపల్లి గ్రామస్తులకు ఊరట లభించింది. జాతీయ రహదారికి నేరుగా అనుసంధానించే మార్గం పునరుద్ధరణ కావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్