- ఎఐకెఎస్ 36వ జాతీయ మహాసభకు సర్వం సిద్ధం
- నేటి నుండి అగ్రిషో, సాంస్కృతిక ఉత్సవాలు
- రేపు భారీ బహిరంగ సభ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో: భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు సాక్షిగా నిలిచిన నల్లగొండ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. దేశ రైతాంగ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసే అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) 36వ జాతీయ మహాసభ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుండి ( ఈ నెల 15వ తేది )18 వ తేది వరకు జరగనున్న ఈ మహాసభకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తరలిరానున్నారు. 'ఇంటికో మనిషి.. ఊరికో బండి' అన్న పిలుపుతో గ్రామగ్రామాన జనసమీకరణ సాగుతోంది. ఎర్రజెండాలు, తోరణాలు, స్వాగత ద్వారాలు, బ్యానర్లతో నల్లగొండ పట్టణం ఎర్రబారింది.
రేపు (ఆదివారం)ఎన్జి కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ కార్మికులు తరలిరానున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు బృందా కరత్ ప్రధాన వక్తగా హాజరుకానున్నారు. ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ తదితరులు ప్రసంగించనున్నారు.
మర్రిగూడెం బైపాస్ నుంచి ఎన్జి కాలేజీ వరకు మహా ప్రదర్శన..
బహిరంగ సభకు ముందు మధ్యాహ్నం ఒంటి గంటకు మర్రిగూడెం బైపాస్ నుంచి ఎన్జి కళాశాల వరకూ మహా ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనలో భాగంగా రెడ్ షర్ట్ వలంటీర్లు కవాతు చేయనున్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, ప్రజాసంఘాల కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఆదివారం నుండి బుధవారం (15వ తేది నుండి - 18వ తేది) వరకు నల్లగొండలోని జిఎం కన్వెన్షన్ సెంటర్లో జాతీయ ప్రతినిధుల సభ జరగనుంది. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,200 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. పరిశీలకులు, ఇతరులతో కలిపి రెండు వేల మంది హాజరుకానున్నారు. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, పంటల కొనుగోళ్లు, రైతుల రుణభారం, వ్యవసాయ కార్మికుల ఉపాధి, సాగునీటి సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, కార్పొరేట్ సంస్థల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణకు అనుసరించాల్సిన విధానాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
నేడు 125 స్టాళ్లతో అగ్రి షో ప్రారంభం
మహాసభకు అనుబంధంగా నేడు నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో భారీ వ్యవసాయ ప్రదర్శన (అగ్రి షో) నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన 15,16 తేదీలలో కూడా కొనసాగనుంది. వ్యవసాయ రంగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు 125 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తులు, వివిధ పరికరాలను ప్రదర్శించనున్నారు. అగ్రిషో ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరుకానున్నారు. క్లాక్ టవర్ సెంటర్లోనే నేటి నుంచి 16 వరకు సాంస్కృతిక ఉత్సవాలు కూడా జరగనున్నాయి.
90 ఏండ్ల ఎఐకెఎస్ ప్రస్థానం.. 80 ఏండ్ల తెలంగాణ పోరాట వారసత్వం
1936లో ఆవిర్భవించిన అఖిల భారత కిసాన్ సభ దేశవ్యాప్తంగా రైతాంగ హక్కుల కోసం తొమ్మిది దశాబ్దాలుగా ఉద్యమిస్తోంది. సంస్థ 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏండ్ల చారిత్రక నేపథ్యం ఈ మహాసభకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల త్యాగాలు నేటికీ రైతాంగ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. నాటి పోరాట వారసత్వాన్ని నేటి వ్యవసాయ సమస్యలతో అనుసంధానిస్తూ జాతీయ స్థాయిలో చర్చలు జరగనున్నాయి.







కామెంట్లు (0)