శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AP: ఇక పంచాయతీ పోరు

1 గంట క్రితం

elec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 10:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • తొలి విడత ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

  • -26న పోలింగ్‌.. అదే రోజు ఓట్ల లెక్కింపు

  • -3,967 సర్పంచ్‌, 40,012 వార్డు స్థానాలకు ఎన్నికలు

  • -ఏకగ్రీవాలకు ప్రోత్పాహకాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 26న ఉదయం7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనుంది. తొలి విడతలో 26 జిల్లాల్లోని మండలాల్లో 3,967 సర్పంచ్‌, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల15 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18న నామినేషన్ల పరిశీలన, 19న అప్పీళ్ల స్వీకరణ, 20న అప్పీళ్ల పరిష్కారం చేపడతారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థిత్వాల ఉపసంహరణకు గడువు విధించారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఏవైనా కారణాలతో రీపోలింగ్‌ అవసరమైతే ఈ నెల 27న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,167 సర్పంచ్‌ స్థానాలు, 1,32,514 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. జిల్లాలవారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 404 సర్పంచ్‌, 3,684 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా 51 సర్పంచ్‌, 634 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగడం లేదు.

​జిల్లాల వారీగా మండలాలు..

తొలి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలవారీగా మండలాల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది చొప్పున, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో ఎనిమిది చొప్పున, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు, పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదు చొప్పున మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏలూరులో 11, కృష్ణాలో ఆరు, ఎన్‌టిఆర్‌ జిల్లాలో ఐదు, పల్నాడులో ఏడు, బాపట్లలో ఆరు, మార్కాపురంలో ఆరు మండలాలను తొలి విడతకు ఎంపిక చేశారు.నెల్లూరు జిల్లాలో ఎనిమిది, తిరుపతిలో 16, చిత్తూరులో తొమ్మిది, అన్నమయ్యలో ఆరు, వైఎస్సార్‌ కడపలో 13, అనంతపురంలో 13, శ్రీ సత్యసాయిలో ఏడు, కర్నూలులో ఎనిమిది, నంద్యాలలో ఎనిమిది మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలపై న్యాయస్థానాల ఆంక్షలు ఉన్న గ్రామ పంచాయతీల్లో, పరిపాలనా, న్యాయపరమైన కారణాలతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని చోట్ల నోటిఫికేషన్‌ జారీ చేయరాదని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. రీపోలింగ్‌ జరిగిన గ్రామ పంచాయతీల్లో ఫలితాలు వెల్లడైన తర్వాతే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించాలని స్పష్టం చేసింది.

​ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహక నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026 సాధారణ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 2 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2,001 నుంచి 5 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలకు పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల ప్రోత్సాహకం అందించేవారు. తాజాగా ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచింది. ఇకపై 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైబడిన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల ప్రోత్సాహకం అందించనుంది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డుల సభ్యులు (పూర్తి పాలకవర్గం) ఏకగ్రీవంగా ఎన్నికైతేనే ఈ ప్రోత్సహక నిధులు అందిస్తారు. ఎన్నికల అధికారులు ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించడంతోపాటు సంబంధిత అధికారులు అర్హతను ధ్రువీకరించాల్సి ఉంటుంది. మంజూరైన నిధులను సంబంధిత పంచాయతీల అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలి. పంచాయతీ పదవీకాలంలో దశలవారీగా నిధులు విడుదల చేస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్