శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

CII: షరతులు పెడితే పెట్టుబడులు వస్తాయా?

26 నిమిషాల క్రితం

షరతులు పెడితే 
       పెట్టుబడులు వస్తాయా? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పెట్టుబ‌డిదారులకు రక్షణ చట్టం తెస్తాం ​

  • 40 అంశాలపై సిఐఐ సమ్మిట్‌లో చర్చలు

  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ‘షరతులు పెడితే పారిశ్రామికవేత్తలు వస్తారా ? పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడిదారులకు రక్షణ కల్పిస్తాం.. చట్టం తెస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో శుక్రవారం సాయంత్రంతో ముగిసిన రెండు రోజుల సిఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ భూమి, మౌలిక వసతులు తీసుకుని పరిశ్రమ పెట్టని వారిపై ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ‘పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఎకరా భూమిని, వచ్చిన ప్రతి ఎంఒయును సమీక్షిస్తాం. టెక్నాలజీతో రాష్ర్టంలోని అన్ని సమస్యలనూ జయిస్తాం. 2024 నుంచి రాష్ర్టంలోకి వచ్చిన పెట్టుబడులకు రక్షణ కల్పించేలా చట్టం తెస్తాం’ అని చెప్పారు. ‘ఒక ప్రభుత్వం పోతే... వచ్చే మరో ప్రభుత్వం పెట్టుబడులను దెబ్బతీయకుండా రక్షణ చట్టం తెచ్చి కేంద్రానికి పంపి పార్లమెంట్‌‌లో చట్టం జరిగేలా ప్రయత్నిస్తాం’ అని చెప్పారు. తాజా సిఐఐ సమ్మిట్‌‌ను అత్యంత నాణ్యంగా నిర్వహించినట్లు చెప్పారు. పెట్టుబడులే కాకుండా 40 సబ్జెక్టులపై చర్చలు జరిపామన్నారు. ఎంఒయుల సాకారంపై ఆడిట్‌ ‌రిపోర్టు ప్రతి ఏటా ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.

రియల్‌‌టైం గవర్నెన్స్‌‌ పక్కాగా అమలు

రియల్‌ ‌టైం గవర్నెన్స్‌‌ను పక్కాగా అమలు చేస్తున్నామని, గతంలో మాదిరి పేపర్‌‌పై పెట్టుబడులు కాకుండా ఈ రెండేళ్లలో తమ ప్రభుత్వ పనితీరులో పెద్ద మార్పు రావడంతో ఎంఒయుల్లో 76 శాతం అమలయ్యాయని చంద్రబాబు చెప్పారు. సబ్సిడీలు, ప్రోత్సహకాల విషయంలో అర్హులైన పారిశ్రామికవేత్తలకు ఎస్క్రో ఖాతాలకు జమ చేసే విధానం తెచ్చామన్నారు. ఎవరి చుట్టూ తిరిగే పనిలేదని తెలిపారు. తిరుపతిలో గ్లోబల్‌ ‌హబ్‌‌కు పది వేల ఎకరాలు అవసరం ఉందని, ఐదు వేల ఎకరాలను ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తుందని తెలిపారు. విశాఖలో అరుదైన భూగర్భ ఖనిజాలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయన్నారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

మీడియాపై రుసరుస

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు రుసరుసలాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చక్కెర పరిశ్రమలు మూతపడుతున్నాయని ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని అడగ్గా.. ‘మీ బాడీలో షుగర్‌ ఉందా? స్వీట్లు తిని ఎన్నాళ్లు అవుతుంది?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మీడియా వాళ్లకి మసాలా కావాలని పదేపదే చంద్రబాబు అన్నారు. మంత్రులు, అధికారులు బాగా పనిచేస్తే ప్రభుత్వం బాగుంటుందని, మీడియా కూడా బాగా రిపోర్టింగ్‌ ‌చేస్తే ప్రభుత్వం బాగుంటుందని పేర్కొన్నారు. తాను వ్యవసాయాన్ని మరచిపోలేదని, ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే అంశంపై టెక్నాలజీని అనుసంధానించి రైతులకు సలహాలు అందిస్తామని చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌ తదితరులు పాల్గొన్నారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్