శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

CII: ఎంఒయులు ఆచరణ రూపం దాల్చాలి

27 నిమిషాల క్రితం

ఎంఒయులు ఆచరణ రూపం దాల్చాలి
- సిఐఐ సదస్సు ముగింపులో ఉప రాష్ర్టపతి సిపి రాధాకృష్ణన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 11:53 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

- సిఐఐ సదస్సు ముగింపులో ఉప రాష్ర్టపతి సిపి రాధాకృష్ణన్‌

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : పెట్టుబడులు ఎంఒయులకే పరిమితం కారాదని, ఆచరణ రూపం దాల్చాలని ఉప రాష్ర్టపతి సిపి.రాధాకృష్ణన్‌ ‌అన్నారు. ‘వర్క్‌ ‌టుగెదర్‌, గ్రోత్‌ ‌టుగెదర్‌, షేర్‌ ‌ప్రాస్పరిటీ’ విధానంతో ముందుకు సాగాలని సూచించారు. ఎపి 2024 జూన్‌ ‌నుంచి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అసాధారణమైన విషయమని, ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ‌దూసుకెళ్తోందని ప్రశంసించారు. 76 శాతం సిఐఐ ఎంఒయులు అమలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, దేశంలో ఎపి మేజర్‌ ఇండస్ర్టియల్‌ ఇన్నోవేషన్‌ ‌హబ్‌‌గా ఖ్యాతి గడించిందని అన్నారు. విశాఖలోని ఎయు ఇంజనీరింగ్‌ కాలేజీ ‌మైదానంలో రెండు రోజులపాటు జరిగిన సిఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన రాధాకృష్ణన్‌ ‌ముగింపు సదస్సులో మాట్లాడుతూ పెట్టుబడి ఒప్పందాలతో పాటు కీలక అంశాలపై మేథోమధనం జరిగిందన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సదస్సుకు కూడా పారిశ్రామిక వేత్తలను ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడం, అదికూడా కుటుంబాలతో రమ్మని చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ర్ట విభజన అనంతరం ఎదురైన ఇబ్బందులను అధిగమించి ఎపి అభివృద్ధిలో ముందుకు సాగుతోందని, పోర్టులు, విమానాశ్రయాలు, ఎలక్ట్రానిక్స్‌, స్పేస్‌, డిఫెన్స్‌‌ పర్యాటక రంగాల్లో రాష్ర్టం పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ఎపిలో ఎఐ వంటి అధునాతన సాంకేతికను పాలన, పౌరసేవల్లో వినియోగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

​ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం : రాష్ర్ట గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడం ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల విశ్వాసానికి నిదర్శనమని రాష్ర్ట గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ అన్నారు. ఆసియా నుంచి ఆఫ్రికా వరకూ వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారని చెప్పారు.

​​విశాఖ స్టీల్‌‌ప్లాంట్‌‌ను పునరుద్ధరించాం : ముఖ్యమంత్రి చంద్రబాబు

వైజాగ్‌‌ స్టీల్‌‌ప్లాంట్‌‌ను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకారంతో భోగాపురం ఎయిర్‌‌పోర్టు పూర్తి చేశామని, రైల్వే జోన్‌ ‌వంటి కీలక ప్రాజెక్టులు సాధించామని తెలిపారు. రాష్ర్టంలో ప్రతి ప్రాంతానికీ పెట్టుబడులు, ప్రాజెక్టులు తేవడమే తమ సంకల్పమన్నారు. గతంలో ఐటి విప్లవాన్ని తెచ్చామని, ఇప్పుడు వన్‌ ‌ఫ్యామిలీ ఒన్‌ ‌నేషన్‌ విధానంతో ఎఐ నిపుణులను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం జాతీయ స్థాయిలో ఉందని, ఎపి ఒక్కటే 160 గిగావాట్ల లక్ష్యాన్ని పెట్టుకుందని, కేంద్రం సహకరిస్తేనే లక్ష్యాన్ని దాటగలమన్నారు. కియా సంస్థ ఏడాదికి అదనంగా రెండు లక్షల కార్ల తయారీ కోసం రూ.18,878 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. రిలయన్స్‌ ‌సంస్థ రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో ఎంఒయు చేసుకుందన్నారు. 2024 నుంచి వచ్చిన 714 ఎంఒయుల ప్రతిపాదనల్లో 522 వాస్తవ రూపం దాల్చే క్రమంలో ఉన్నాయని వివరించారు. పారిశ్రామిక అనుమతుల విషయంలో 13 లైసెన్సుల ద్వారా ఐదు రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. రాష్ర్టంలో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు పి4 కార్యక్రమాన్ని చేపట్టామని, ఇప్పటికే లక్ష మంది మార్గదర్శులు 11 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని మద్దతుగా నిలిచారని తెలిపారు. రాష్ర్టంలో తాను చేస్తున్న నదుల అనుసంధానం చొరవతో గోదావరి-కావేరి అనుసంధానం దక్షిణాది రాష్ర్టాల మధ్య అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్‌, టిజి. భరత్‌, సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, సిఐఐ అధ్యక్షురాలు డాక్టర్‌ సుచిత్ర ఎల్లా తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు 12 ఎంఒయులు

సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజైన శుక్రవారం జెఎస్‌డబ్ల్యు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గ్రీన్ జెన్, ఎయిర్ ట్రంక్- జెసికె ఇన్ ఫ్రా, డిక్సన్ టెక్నాలజీస్, కాకినాడ సీపోర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పి4 కార్యక్రమంలో భాగస్వాములుగా మారుతూ ఐటిసి, హీరో మోటార్స్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రూ.1,41,585 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 12 ఒప్పందాలను వివిధ కంపెనీలు చేసుకున్నాయి. ఈ ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా 10,919 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరులో మైనింగ్ కార్యకలాపాల కోసం జిందాల్ గ్రూప్ రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. తిరుపతి జిల్లాలో ఆర్బిటల్ డేటా సెంటర్, రాకెట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అగ్నికుల్ కాస్మోస్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.510 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హాథోర్ రాకెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. పునరుద్పాక ఇంధన రంగంలో గ్రీన్ జెన్ రెన్యూబుల్ ఎనర్జీ రూ.ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎపి నెడ్ క్యాప్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ రంగంలోనే రూ.6,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగానూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్ క్యాంపస్‌ల ఏర్పాటు, 1400 మెగావాట్ల టెలికామ్ సెంటర్ల ఏర్పాటు కోసం ఐటి విభాగంతో ఎయిర్ ట్రంక్ ఇండియా- జెసికె ఇన్‌ఫ్రా ఒప్పందం చేసుకుంది. రూ.1,03,018 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 3,120 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎయిర్ ట్రంక్- జెసికె ఇన్ ఫ్రా సంస్థలు ఒప్పందంలో పేర్కొన్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా రూ.700 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది. కాకినాడ పోర్టులో మెకనైజ్డ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ ప్లాంట్, షిప్ బిల్డింగ్, రిపేర్ కాంప్లెక్సు ఏర్పాటు కోసం ఎపి మారిటైమ్ బోర్డుతో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.6452 కోట్ల పెట్టుబడితో మెకనైడ్జ్ బెర్త్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు చేయటంతో 852 మందికి ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రాజధాని అమరావతిలో ఒబెరాయ్ హోటల్ ఏర్పాటు కోసం ఎపిసిఆర్‌డిఎ ఇఐహెచ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.175 కోట్ల పెట్టుబడితో, 150 మందికి ఉద్యోగాల కల్పించనున్నట్టు తెలిపింది.

పి4 కార్యక్రమానికి సంబంధించి సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండు ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో 1,120 మంది ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు ఆర్థిక సహకారం అందించేందుకు హీరో మోటార్ కార్పోరేషన్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. 10వ తరగతి చదివి ట్రిపుల్ ఐటికి ఎంపికైన విద్యార్థులకు రూ.2.9 లక్షల చొప్పున స్కాలర్‌షిప్ అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసింది. బ్రిజ్ మోహన్ ముంజాల్ స్కాలర్‌షిప్‌లను విద్యార్ధులకు అందించేందుకుగానూ రూ.32.48 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఈ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ఐటిసి లిమిటెడ్ స్వర్ణాంధ్ర పి4 ఫౌండేషన్‌‌తో ఒప్పందం చేసింది. ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన 11 ఎంఒయూలు, 1 జిఒ జారీ ద్వారా రూ.1,41,585 కోట్ల పెట్టుబడులు, 10,919 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్