- మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు
ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల జిల్లా) : రైతులకు సాగునీరు లేకపోతే వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాదీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నలమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రైతుల రిలే నిరాహార దీక్ష శిబిరానికి శుక్రవారం ఆయన విచ్చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను గాని, సాగునీటి గురించి గాని, వ్యవసాయం గురించి గాని సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి, పెట్టుబడులు ఎలా వస్తాయి, ఫారిన్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఎలా వస్తాయి.. అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. రైతుల పట్ల ఉదాసీన వైఖరిని మానుకోవాలని కోరారు. నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. ఈ పొడిగింపును సాధించుకోకపోతే రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని ఈ నెల 24న నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్‌రావు, సిపిఐఎంఎల్ నాయకులు హరినాథ్ గడ్డిపాటి శ్రీనివాసరావు, హరిబాబు, రైతులు, ప్రజాసంఘం, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)