- సిఎం చంద్రబాబుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హితవు
- ఒంగోలులో పొగాకు వేలంకేంద్రం సందర్శన
ప్రజాశక్తి - ఒంగోలు బ్యూరో : మాటలు కాదు నిధులు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం చంద్రబాబుకు హితవు పలికారు. కిలో రూ.200 లకు తగ్గకుండా కొనాలని సిఎం చెప్పారని, వ్యాపారులు రూ.160లకు మించి ధర ఇవ్వడం లేదన్నారు. బుధవారం నాడు ఆయన ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లు పరిశీలించారు. వేలంలో పాల్గొన్నారు. ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయన ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు ఇచ్చి కొనుకోలు చేయించాలని డిమాండ్ చేశారు. వ్యాపారులపై ప్రభుత్వం వత్తిడి పెంచాలన్నారు.
వారం క్రితం క్వింటా వర్జినియా పొగాకు ధర రూ 20వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయకపోగా ధర మరింత దిగజారిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం నాడు స్థానిక కలెక్టరెట్ వద్ద వర్జినియా పొగాకు కొనుగోలుకు కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పమిడి వెంకటరావు, కె వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ... గిట్టుబాటు ధర కోసం ఒంగోలులో రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయడంలో బోర్డు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు దుయ్యబట్టారు. ఏటా వేలకోట్లు రూపాయలు ఆదాయం పొందుతూ ఖజానాలో భద్రపరచుకుంటున్న కంపెనీలు ధరలను పెరగనీయకుండా వ్యవహారుస్తున్నట్లు ఆరోపించారు. రైతు ప్రతినిధుల చర్చల్లో సానుకూలంగా వ్యవహరించకపోగా, బోర్డు మీటింగ్ జరిగే 25తేదీ వరకు ఆందోళన వాయిదా వేయమని కోరడం విచారకరమన్నారు. 25 లోపు చర్యలు లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని, దీనికి ప్రభుత్వం భాద్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో చుండూరు రంగారావు, ఎస్కె మాబు, ఎస్ లలితకుమారి, జివి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
రైతులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
పొగాకు రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతూ..
పొగాకు రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతూ..

ఒంగోలులో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శిస్తూ..








కామెంట్‌లు (0)