10,060 ఖాళీల భర్తీకి నిర్ణయం
మంత్రివర్గ సమావేశ నిర్ణయాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబరులోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. దాదాపుగా రూ.16,500 కోట్ల ఆర్థికసంఘం నుండి రావాల్సి ఉండటంతో ఆ మొత్తం మురిగిపోకుండా ఉండటానికి అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష పద్దతిలోనే ఎన్నిక లకు వెళ్లాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు సమాచారం. అయితే డిప్యూటీ మేయర్‌ను మాత్రం ప్రస్తుత పద్దతిలోనే ఎన్నుకోవాలని నిర్ణయించారు. జిల్లాల విభజనకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ లు ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. న్యాయ పరిధిలో ఉన్న 23 మునిసిపాలిటీల విలీనంపై చర్చకు వచ్చింది. దీనిపై తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఎపిపిఎస్‌సి, డిఎస్‌సితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 10,060 ఖాళీలను ప్రత్యక్ష విధానంతో భర్తీ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లా కేంద్రాల్లో హెచ్‌ఆర్‌ఏను 12% నుండి 16% కి పెంచాలని నిర్ణయించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున ధరల నియంత్రణ కు చర్యలు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్ల పై ధీటుగా స్పందించాలని, మద్యం బ్రాండ్ లు పిచ్చి పిచ్చి పేర్లతో రాకుండా కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమార్కులు కంటైనర్లలో ఇసుక తరలింపు చేస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం
మంత్రివర్గ భేటీ సమావేశంలో 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పేరును ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా మార్పు చేసేందుకు, అలాగే హ్యుందాయ్ డైమోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరును "హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్"గా మార్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద ఫాస్ఫారిక్ యాసిడ్ ప్లాంట్ ఏర్పాటు కోసం మెస్సర్స్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు 450 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఏకార్లపల్లి గ్రామంలో అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ (విస్తరణ) ప్రాజెక్ట్ కొరకు మెస్సర్స్ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 60 ఎకరాల భూమి కేటాయించాలని, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు, పైనంపురం గ్రామాల్లో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం 680.55 ఎకరాల భూమిని మెస్సర్స్ ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ పేరిట విక్రయ దస్తావేజు అమలు చేసేందుకు, భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభ్యర్థన మేరకు స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపునకు ఆమోదం తెలిపారు.
సూర్యలంకలో 3 స్టార్ హోటల్
బాపట్ల సూర్యలంక బీచ్ వద్ద 3-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం శుభమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని 2.5% నుండి 1% కి తగ్గించేందుకు, మరికొన్ని హోటళ్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు కూడా ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద రూ. 85,200 కోట్ల పెట్టుబడితో, 1,880 మందికి ఉపాధి కల్పించే 1,000 MW హైపర్‌స్కేల్, కొలోకేషన్ డేటా సెంటర్ ఏర్పాటుకి రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 433.30 ఎకరాల భూమి కేటాయింపుతోపాటు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనాం గ్రామంలో రూ. 31,387 కోట్ల పెట్టుబడితో, 1,000 మందికి ఉపాధి కల్పించే 512 మెగావాట్ల గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు.
అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు నూతన బ్రాడ్ గేజ్ రైల్ లైన్ నిర్మాణం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలోని 2,344.12 ఎకరాల భూమికి గ్రామసభ తీర్మానం ప్రకారం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ చేపట్టడానికి సిఆర్‌డిఎకు అధికారం కల్పించనున్నారు.







కామెంట్‌లు (0)