రోజూ పెరుగు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతగానో మేలు చేసే ప్రోబయాటిక్స్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తాయి. పెరుగులో ఆరోగ్యకరమైన ప్రోబయాటిక్స్ మాత్రమే కాకుండా శరీర ఎదుగుదలకు అత్యవసరమైన ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12 వంటి ముఖ్యమైన పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. రోజువారీ సమతుల్య ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన తక్షణ శక్తిని పొందవచ్చు. రోజంతా అలసట లేకుండా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా పేగుల్లో హానికర క్రిములను నశింపజేస్తుంది. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, జీర్ణక్రియ సులభంగా సాగడానికి దోహదపడుతుంది.
మజ్జిగతో పోల్చి చూస్తే పెరుగులో ప్రొటీన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాల బలానికి, శరీర ధృడత్వానికి ప్రొటీన్లు అత్యవసరం. పెరుగు తినడం వల్ల మీకు ప్రొటీన్లు అందుతాయి.
అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలంటే పెరుగు తింటే మంచిది. అలాగే మజ్జిగలో నీటి శాతం అత్యధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో ఉండే వివిధ రకాల ఖనిజ లవణాలు, ఎలక్ట్రోలైట్లు శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తినిస్తుంది. అలసట పోతుంది.
మజ్జిగ తాగితే బరువు తగ్గుతారు. ఇందులో కొవ్వు, క్యాలరీల శాతం చాలా తక్కువగా ఉంటుంది. శరీర బరువును నియంత్రణలో ఉంచడానికి మజ్జిగ తోడ్పడుతుంది.







కామెంట్‌లు (0)