ఒక చిట్టడవిలో కొన్ని జంతువులు ఉండేవి. ఒక రోజు చిట్టి కుందేలు అటూ ఇటూ తిరుగుతూ ఏడ్వసాగింది. అది చూసిన అంజి, చిలుక, తాబేలు ‘చిట్టీ.. ఎందుకూ ఏడుస్తున్నావు?’ అని అడిగాయి. ‘అమ్మకేమో జ్వరంగా ఉంది.. నాకేమో ఆకలిగా ఉంది’ అని అంది. ‘కంగారు పడకు. నేను వెళ్లి ఎలుగుబంటి మామను పిలుచుకువస్తాను’ అని చిలుక ఎగిరిపోయింది. అంజి చిట్టికి తోడుగా ఉంది. తాబేలు, చిట్టి కోసం ఆకులు తేవడానికి అటు పక్కగా వెళ్లింది.
చిలుక, ఎలుగుబంటి వద్దకు చేరుకుని విషయం చెప్పింది. ‘జ్వరం తగ్గించే ఔషధ మొక్కల ఆకులు తెస్తాను.. నువ్వు వెళ్లు’ అని అంది ఎలుగుబంటి. ‘అలాగే’ అని చిలుక ఎగిరిపోయింది. తాబేలు బచ్చలాకులు కుందేలు ఇంటి వద్దకు చేర్చింది. చిలుక చేరుకున్న కాసేపటికి ఎలుగుబంటి వచ్చి చేతిలో ఉన్న ఆకులను బాగా నలిపి ఆ ముద్దను కుందేలు ముక్కుకు వాసన చూపించింది. కాసేపటికి కుందేలు హుషారుగా కళ్ళు తెరిచింది. ‘ఇప్పుడు కాస్త ఆహారం తీసుకో’ అని అంది ఎలుగుబంటి. తాబేలు తెచ్చిన బచ్చలాకులు తల్లి కుందేలు, చిట్టి కుందేలు తిని, అంజి, చిలుక, తాబేలు, ఎలుగుబంటి నేస్తాలకు కృతజ్ఞతలు చెప్పాయి.
యు. విజయశేఖర రెడ్డి, హైదరాబాద్.







కామెంట్‌లు (0)