శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ వర్షం - స్తంభించిన జనజీవనం...!

1 రోజు క్రితం

భారీ వర్షం... స్తంభించిన జనజీవనం...! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బూర్జ: వాయుగుండం ప్రభావంతో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బూర్జ మండలంలోని పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, నాగావళి నది ఉధృతికి వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో అనేక గ్రామాల్లో నీరు రావడంతో ఇబ్బందులకు గురయ్యారు. శ్రీకాకుళం - పాలకొండ ప్రధాన రహదారిపై తుడ్డలి, కొల్లివలస, కురుంపేట గ్రామాల సమీపంలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. అలాగే పాలకొండ నుంచి అల్లెన వెళ్లే మార్గంలో చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మదనాపురం నుంచి సరుబుజ్జిలి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా చెట్లు నేలకొరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

చీకటిలో పలు గ్రామాలు

ఈదురు గాలుల తీవ్రతకు నీలంపేట, లంక గ్రామాల సమీపంలో విద్యుత్ తీగలపై భారీ చెట్లు పడటంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామ ప్రజలు తీవ్ర ఇంధన, తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రహదారులపై ఉధృతంగా వరద నీరు

అల్లెన గ్రామం నుంచి మదనాపురం, బూర్జ మండల కేంద్రానికి వెళ్లే రహదారితో పాటు, చీడివలస నుంచి లాభం వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా పారుతుండటంతో పరిసర ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నీలంపేట, చీడివలస, అల్లెన, వైపర్త, లక్కుపురం, లాభాం, గుత్తావల్లి తదితర గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి.

మునిగిన పంట పొలాలు - అధికారుల పరిశీలన

నాగావళి నదితీర ప్రాంతంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగిపోవడంతో రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పలువురు అధికారులు స్పందించి పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేసి, రోడ్లపై పడిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్