శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతక్షణమే కరువు ప్యాకేజీ

17 సెప్టెంబర్, 2026

1789650430283.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో రైతులకు భరోసా కల్పించాలి

  • పల్నాడు జిల్లాలో కరువు అధ్యయన పర్యటనలో సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ​రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పంటలు సాగు చేయని రైతు కుటుంబాలకు రూ.పది వేల చొప్పున, పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. కరువు పరిస్థితులపై అధ్యయనంలో భాగంగా ప్రభాకరరెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, ఎం.హరిబాబు, జిల్లా కార్యదర్శి జి.విజయకుమార్ తదితరుల బృందం గురువారం నరసరావుపేట, రొంపిచర్ల మండలంలోని పాలపాడు, ఇక్కుర్రు, అల్లూరివారిపాలెం, రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు, మాచవరం, మర్రిచెట్టుపాలెం, రొంపిచర్ల తదితర గ్రామాల్లో పర్యటించింది. పంట పొలాలను పరిశీలించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంది. అనంతరం నరసరావుపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో మీడియాతో ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు లేక కొద్దిపాటి వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో కంది, మిరప, పత్తి పంటలు సాగు చేశారని అన్నారు. పశువులకు మేత కొరత ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రంలో 55 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక ప్యాకేజీ సాధించాలని డిమాండ్‌ చేశారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో దేవాదాయ భూముల్లో పంట లేదని ముందస్తు కౌలు చెల్లించి నష్టపోయామని రైతులు వాపోయారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులు, ప్రజలను ఐక్యం చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య, ఎం.హరిబాబు మాట్లాడుతూ వాతావరణ ఆధారిత, దిగుబడి ఆధారిత అనే తారతమ్యం లేకుండా రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పశువులు, జీవాల కొనుగోలుకు రైతులకు రుణాలు మంజూరు చేసి 90 శాతం రాయితీ కల్పించాలని, పశువులకు ఉచిత వైద్యం, దాణా అందించాలని కోరారు. రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన రుణ ప్రణాళిక రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేలా లేదని, దానిని సవరించాలని డిమాండ్‌ ‌చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరుతడి పంటల సాగుకు ప్రభుత్వం రాయితీపై ఇచ్చిన మినుము, కంది, పెసర తదితర పంటలకు రెండు తడులు నీరు అందాలని కోరారు.

రైతుల సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు, వై.రాధాకృష్ణ, ఎ.లక్ష్మీశ్వర రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్