-పురుగుమందులను అధికంగా వాడొద్దు
-పొగాకు రైతుల సమస్యలపై రెండు రోజుల్లో ఢిల్లీకి బృందం
-చిలకలూరిపేట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-అన్నదాత సుఖీభవ పథకం రెండో ఏడాది తొలి విడత నిధులు విడుదల
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : వ్యవసాయ ఉత్పత్తులపై ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువగా ఉండటం వల్ల ఎగుమతులు పడిపోతున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎరువుల వినియోగం తగ్గించాలని, క్రిమిసంహారక మందులను అధికంగా వాడొద్దని రైతులకు సూచించారు. శనివారం ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో అన్నదాత సుఖీభవ, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రెండో ఏడాది తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2026 ఖరీఫ్ సీజన్‌కు 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్ల ఆర్థిక సాయం జమచేసినట్టు తెలిపారు. ఇటీవల చైనాకు వెళ్లిన మిర్చి కంటైనర్లను మిర్చిపై ఎరువులు, క్రిమిసంహారక మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల తిప్పి పంపారన్నారు. ఎరువులు, పురుగుమందుల ద్వారా భూములను విషతుల్యం చేస్తున్నామని, ఈ విధానం మారాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు పురుగుమందులను, ఎరువులను వినియోగిస్తున్న పంటలను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు మన ఉత్పత్తులు వెళ్లాలంటే మన పంటలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, ఎంత ఖర్చు అయినా చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు. వరి సాగు స్థానంలో వాణిజ్య పంటలను ప్రోత్సహించామన్నారు. పొగాకు ధరలు తగ్గడంతో కిలో రూ.200కి తగ్గకుండా కొనాలని వ్యాపారులను ఆదేశించినట్లు తెలిపారు. పొగాకు సమస్యలపై రెండు రోజుల్లో ఢిల్లీకి ఒక బృందాన్ని పంపి కేంద్రంతో చర్చించి రైతులను ఆదుకుంటామన్నారు. విత్తన సరఫరా నుంచి మార్కెటింగ్ వరకూ రైతులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 48 గంటల్లోనే ధాన్యం రైతులకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. రైతులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని, గత పాలకులు ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఎరువులు, పురుగుమందులకు విరుగుడు ప్రకృతి సేద్యమేనని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో కొందరు రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ భూమి తల్లిని కాపాడుతున్నారని తెలిపారు. కొందరు రైతులు గానుగ ద్వారా సహజ రీతిలో నూనెను ఉత్పత్తి చేయటం సంతోషదాయకమన్నారు. డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వినియోగించే పరిస్థితి మారాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పంట దిగుబడులు కూడా బాగా పెరిగాయని తెలిపారు. రెండేళ్లకు సరిపడా నిల్వలు దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం మనపై కూడా పడుతోందని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆక్వా రైతులకు ఫీడ్ ధరను రూ.4 మేర తగ్గించాలని ఆదేశాలు జారీ చేశామని, గతంలో తోతాపురి మామిడికి మెట్రిక్ టన్నుకు రూ.4 వేలు ఇచ్చామని, బర్లి పొగాకును రూ.279 కోట్ల వ్యయం చేసి కొనుగోలు చేశామని వివరించారు. పంట మార్పిడిపై అవగాహన కల్పించటంతోపాటు రైతులకు ప్రయోజనం కల్పించేలా వారి ఇళ్లకు వెళ్లి వివరించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ నిధుల చెక్కును రైతులకు అందించారు. లింగంగుంట్లలో రహదారుల పరిశీలన ముఖ్యమంత్రి చంద్రబాబు... స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొని రహదారులను పరిశీలించారు. కంపోస్టు ఎరువుల ఉత్పత్తిని చూశారు. రైతులకు ఈ ఎరువులు సరఫరా చేయాలన్నారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లకు లింగంగుంట్ల నుంచి శంకుస్థాపన చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలిసి రాగి జావ తీసుకున్న చంద్రబాబు లింగంగుంట్లలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందుగా టీచర్, సహాయకురాలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందిస్తోన్న సేవలను గురించి సిఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్‌ను అందుకున్న అంగన్‌వాడీ సహాయకురాలు సిఎం సమక్షంలోనే రాగి జావను కాచారు. చిన్నారులతో మమేకమైన చంద్రబాబు వారితో కలిసి కింద కూర్చునే రాగి జావ తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్‌వాడీ ప్రాంగణంలో అంగన్‌వాడీ సిబ్బందితో కలిసి మొక్క నాటారు.









కామెంట్‌లు (0)