ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన అనంతరం పోటీ చేసే అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 28 జిల్లాల్లో 4,975 సర్పంచు స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా, 1,171 స్థానాలు ఏకగ్రీవమయ్యా యని, మిగిలిన 3,803 స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ స్థానాలకు మొత్తం 10,292 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని వెల్లడించింది. 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా, 19,651 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మరో 29,608 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ స్థానాలకు 63,410 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపింది. సర్పంచ్ స్థానాల్లో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 136 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 116, పల్నాడు జిల్లాలో 98, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 93, చిత్తూరు జిల్లాలో 80 స్థానాలు ఏకగ్రీవమైనట్లు వెల్లడించింది. పోటీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం 825 మంది అభ్యర్థులతో మొదటి స్థానంలో ఉంది. తిరుపతిలో 592, విజయనగరంలో 565, ఎస్పిఎస్ఆర్ నెల్లూరులో 542, చిత్తూరులో 483, కర్నూలులో 478 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది.
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 1,21,529 మంది అభ్యర్థులు
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 1,21,529 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటయ్యాయని తెలిపింది. వీటిలో సర్పంచు స్థానాలకు 22,309, వార్డు సభ్యుల స్థానాలకు 99,220 నామినేషన్లు దాఖలయ్యాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మూడో విడతలో మొత్తం 46 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 214 మండలాల్లో 4,244 సర్పంచు స్థానాలకు, 42,712 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది.







కామెంట్లు (0)