500 కేంద్రాలకు ధరణి బియ్యం
వచ్చే నెల నుంచి కందిపప్పు, పామాయిల్
సమీక్షలో సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు ఊరట కలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నిత్యావసరాల ధరల నియంత్రణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న ఏడాదిన్నర పాటు నిరంతరం మార్కెట్ ధరలను, ద్రవ్యోల్బణాన్ని బేరీజు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ధరల నియంత్రణ చర్యలతో మార్కెట్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో నాలుగు వెరైటీల బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గాయని తెలిపారు. అలాగే ఉల్లి ధర 28 శాతం మేర తగ్గిందన్నారు. పామాయిల్ ధరలు కూడా 5 శాతం తగ్గి లీటరు రూ.145కు చేరిందని అధికారులు వెల్లడించారు. కందిపప్పు ధరల్లో ఇంకా పెరుగుదల కన్పిస్తోందని చెప్పారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కిలో కంది పప్పు రూ.100, పామాయిల్‌ను లీటరు రూ.125 చొప్పున వినియోగదారులకు అందించాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. కంది సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాలన్నారు. ధరణి బ్రాండ్ పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న 26 కిలోల బస్తా సూపర్-ఫైన్ బియ్యానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు వివరించారు. మార్కెట్లో కిలో రూ.76 ఉన్న కెఎన్ఎం/ఆర్ఎన్ఆర్ బియ్యాన్ని రూ.50, రూ.66 ఉన్న బిపిటి ముడి బియ్యాన్ని రూ.49కు అందిస్తుండగా, ఇప్పటి వరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం 286 కేంద్రాల్లో ఈ విక్రయాలను జరుపుతున్నామని అధికారులు చెప్పారు. ఈ కేంద్రాలను 500కు విస్తరించాలని సిఎం ఆదేశించారు. అధిక ధరల విక్రయాలపై విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ బృందాలు 1,558 తనిఖీలు నిర్వహించి 1,005 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.84.59 లక్షల జరిమానా వసూలైందని ముఖ్యమంత్రి అధికారులు వివరించారు.
నీటి లభ్యత ఆధారంగా పంటలు
ఎల్‌నినో ప్రభావంతో వివిధ పంటల దిగుబడులపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఉల్లి, టమోటా ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అగ్రివాచ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కృష్ణా డెల్టా వంటి ప్రాంతాల్లోనూ తక్కువ నీటితో పండే సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలన్నారు. ఫైన్ వెరైటీ రకాలకు అదనపు మద్దతు ధర కల్పించే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాలని, అవసరమైన పక్షంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. మంచి లాభాలు వస్తుండడంతో పల్నాడు వంటి ప్రాంతాల్లోనూ ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా.. భూగర్భ జలాలు లేని ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ వేస్తే భవిష్యత్తులో రైతులు నష్టపోతారని సిఎం పేర్కొన్నారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నచోటే ఆయిల్‌పామ్ సాగును ప్రొత్సహించాలని, నీటి లభ్యత తక్కువగా ఉండే చోట ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చూడాలని ఉద్యానశాఖ అధికారులను ఆదేశించారు. అగ్రివాచ్ డేటా, వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)