ప్రజాశక్తి-బనగానపల్లె : మురసు తుఫాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 1,302 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముసురు తుఫాను వల్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక పునరుద్ధరణకు రూ.98.70 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.772.22 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 332 కి.మీ., గుంటూరులో 266 కి.మీ., ఎన్టీఆర్ జిల్లాలో 202 కి.మీ., పశ్చిమగోదావరిలో 122 కి.మీ., పల్నాడులో 93 కి.మీ., ఏలూరులో 75 కి.మీ., తూర్పుగోదావరిలో 68 కి.మీ., నెల్లూరులో 66 కి.మీ., కృష్ణాలో 59 కి.మీ., ప్రకాశం జిల్లాలో 17 కి.మీ. మేర రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 158 చోట్ల రహదారులు కోతకు గురికాగా, 141 చోట్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 31 చోట్ల రహదారులు కొట్టుకుపోగా, 30 చోట్ల పునరుద్ధరించామని, 60 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతినగా 58 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. 207 చోట్ల పడిపోయిన చెట్లను పూర్తిగా తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశామని, భారీ వర్షాల కారణంగా 120 చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా 116 చోట్ల సమస్యను పరిష్కరించామని తెలిపారు. అధిక వరద ప్రవాహం కారణంగా తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
తుఫాను కారణంగా దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.98.70 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు రూ.772.22 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని రహదారుల పునరుద్ధరణకు రూ.870.90 కోట్లు వ్యయం అవుతుందన్నారు.







కామెంట్లు (0)