ప్రజాశక్తి - హైదరాబాద్ : ఎంఇఐఎల్ గ్రూప్‌నకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మెరుగైన ఆదాయాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో (క్యూ2) కార్యకలాపాల ఆదాయం 4.6 శాతం పెరిగి రూ.687.01 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.656.62 కోట్లుగా నమోదైంది. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 6.8 శాతం వృద్ధితో రూ.52.94 కోట్లుగా చోటు చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.49.55 కోట్ల లాభాలను నమోదు చేసింది. వడ్డీలు, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు లాభం (ఇబిఐటిడిఎ) 2.5 శాతం పెరిగి రూ.91.7 కోట్లకు చేరింది. ముడిసరుకుల వ్యయం ప్రధానంగా ఉండటంతో మొత్తం ఖర్చులు 6.8 శాతం పెరిగి రూ.632.39 కోట్లకు చేరాయి.
8,000 బస్సుల ఆర్డర్..
ఓలెక్ట్రా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,750కుపైగా ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసింది. 55 నగరాల్లో ప్రజా రవాణా సేవలకు తన బస్సులను అందిస్తోందని ఆ కంపెనీ తెలిపింది. ఈ వాహనాలు ఇప్పటివరకు 750 మిలియన్లకు పైగా గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. కంపెనీ వద్ద 8,000కుపైగా ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి. మరోవైపు అనుబంధ సంస్థ ఈవే ట్రాన్స్ (యుజెజె) ప్రైవేట్ లిమిటెడ్‌లో తనకున్న 34 శాతం వాటాను ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ లావాదేవీ విలువ రూ.34,000గా ప్రకటించింది. రానున్న మూడు నెలల్లో విక్రయం పూర్తయ్యే అవకాశం ఉంది. సోమవారం ఎన్ఎస్ఇలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేరు 1.8 శాతం లాభంతో రూ.1,076.95 వద్ద ముగిసింది.






కామెంట్లు (0)