సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెన్నెముక, కీళ్ల సమస్యలపై అవగాహన ఉండాలి

12 నిమిషాల క్రితం

వెన్నెముక, కీళ్ల సమస్యలపై అవగాహన ఉండాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో వెన్నెముక, కీళ్ల సమస్యలపై నిర్వహించిన ఆరోగ్య సభలో ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి దాట్ల, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ బి.వి. హరికృష్ణ పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వయసురీత్యా కండరాలు బలహీనపడటం, కొల్లాజెన్ శక్తి తగ్గడం, ఎముకలు గుల్లబారడం వల్ల నడుము నొప్పి వస్తుందని తెలిపారు. నివారణకు వెనుక సపోర్టుతో కూర్చోవడం, కింద ఉన్న వస్తువులు తీసేటప్పుడు మోకాళ్లు వంచడం, ఏకధాటిగా 20 కిలోమీటర్లకు మించి బైక్ నడపకపోవడం, నిటారుగా కూర్చోవడం, అధిక బరువులు ఎత్తకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెన్నుపూసలోని డిస్క్ అరిగినప్పుడు తొలిదశలో మందులతో, డిస్క్ జరిగి నరాలపై ఒత్తిడి పడితే సయాటికా సమస్య వస్తుందని, దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చన్నారు.సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం, ఎక్కువసేపు ఒకే వైపు చూడటం, ఎత్తు దిండ్లు వాడటం వల్ల సర్వైకల్ సమస్య వస్తుందని, దీర్ఘకాలిక మధుమేహం ఉన్నవారిలో భుజం కండరాలు బిగుసుకుపోయి ఫ్రోజెన్ షోల్డర్ వస్తుందని దీనికి వ్యాయామాలు, సర్జరీ ద్వారా ఉపశమనం పొందవచ్చని వివరించారు.డాక్టర్ బి.వి.హరికృష్ణ మాట్లాడుతూ అన్ని సమస్యలకు సర్జరీయే పరిష్కారం కాదని, ఫిజియోథెరపీతోనూ అనేక నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవచ్చని తెలిపారు. డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్రోజెన్ షోల్డర్‌ను ఫిజియోథెరపీ ద్వారా తగ్గించవచ్చని, రోగి శరీర దృఢత్వాన్ని బట్టి వైద్య పద్ధతులు మారుతాయని అన్నారు. మోకాళ్ల మార్పిడి ఫ్యాక్చర్లు జరిగినప్పుడు సర్జరీ తర్వాత తప్పకుండా ఫిజియోథెరపీ చేయించుకోవాలని, లేదంటే కండరాలు బిగుసుకుపోయి పూర్తి ఫలితం రాదని హెచ్చరించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చలనం కోల్పోయిన అవయవాలకు ప్రత్యేక వ్యాయామాలు, అధునాతన యంత్రాల ద్వారా మళ్లీ కదలిక తెప్పించవచ్చని తెలిపారు. సభలో సభ్యుల సందేహాలను వైద్యులు నివృత్తి చేశారు.అనంతరం వైద్యులను అవగాహన సభ్యులు సత్కరించారు. సభకు టీవీ సాయిరాం కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా, చల్లా అంజిరెడ్డి, ఆరోగ్య సమస్యల విశ్లేషకుడు వి.వి.రావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్