- 16 లక్షల ఎకరాలను 22 ఎ జాబితా నుండి తొలగించాం
- రీసర్వే 2.0తో రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కారం
- పి.గన్నవరం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి - అమలాపురం*(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా): రైతుల, యజమానుల భూమికి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన పర్యటించారు.తొలుత పి.గన్నవరం మండలం పండువారిపేటలో మీ భూమి- హక్కు పేర నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రతీ నెలా 9 తేదీన ఈ కార్య్రకమాన్ని నిర్వహించి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రీసర్వే 2.0తో రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కరించామని, 16 లక్షల ఎకరాలను 22ఎ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. భూమిపై రైతులకు, యజమానులకు హక్కులు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పాలకులు రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి వ్యవస్థను ధ్వంసం చేశారని, ఇష్టం లేని వ్యక్తుల భూముల్ని, ఆస్తుల్ని 22ఎ జాబితాలో చేర్చి ఇబ్బందులు పెట్టారని విమర్శించారు. అందుకే పటిష్టంగా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసి ఎక్కడా అవకతవకలు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తున్నామన్నారు. భూమికి భద్రత ఇవ్వటమే కూటమి ప్రభుత్వ అజెండా అని చెప్పారు. ఇప్పటి వరకూ 8234 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 36 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామన్నారు. వచ్చే మార్చి నాటికి 8,582 గ్రామాల్లో 56 లక్షల పాస్ పుస్తకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తప్పులు సరిచేసి 16 లక్షల ఎకరాలను 22ఎ జాబితా నుంచి తొలగించి సమస్యను పరిష్కరించామని వివరించారు. శెట్టిపల్లి కంగుంది, వట్టి చెరుకూరు, ముదినేపల్లి లాంటి చోట్ల దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న 244 కీలక భూ సమస్యలకు విముక్తి కల్పించామ న్నారు. అమలాపురంలోని మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రాపురం లో బ్రిటీష్ కాలంలో 1908 నుంచి 22 ఎ1 కింద భూములు నిషేధంలో ఉన్నాయని ఈ సమస్యను కూడా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. 56.37 ఎకరాల భూమిని 1410 మందికి లబ్ది కలిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. అంతకు ముందు ఇపిడిసిఎల్ రూ.240 కోట్లతో చేపట్టిన గ్రిడ్ ఆధునికీకరణ పనుల శిలాఫలకాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి, స్థానిక ఎంఎల్ఎ గిడ్డి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
గ్రౌండ్‌రెంట్ భూములకు విముక్తి
అంబాజీపేట మండలం మాచవరం జయంతినగర్లో గ్రౌండ్ రెంట్ భూముల్లో నివసిస్తున్న కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 120 ఏళ్లుగా నిషేధిత జాబితాలో ఉండిపోయిన ఈ భూములకు విముక్తి కల్పించి పత్రాలు ఇస్తున్నట్టు వారికి తెలిపారు.గ్రౌండ్ రెంట్ స్థలాలను గ్రామ కంఠం భూములతో సమానంగా పరిగణించి 22ఎ1 నిషేధిత జాబితా నుంచి తొలగించామని వివరించారు. ఈ ప్రక్రియతో అమలాపురం, మాచవరం, ముమ్మడివరం, రామచంద్రాపురం లో మొత్తం 1416 మంది నివాసితులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 1281 సర్వే నెంబర్లలోని 57.37 ఎకరాల భూమికి విముక్తి కల్పించామని తెలిపారు. అనంతరం వారికి భూమి పత్రాలు అందించారు.








కామెంట్‌లు (0)