మల్కాపురం (విశాఖ) : పింఛన్ల పంపిణీ కోసం ఉంచిన ప్రభుత్వ నిధులతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన విశాఖపట్నంలో జరిగింది. లబ్ధిదారులకు అందాల్సిన సొమ్మును కాజేసి సదరు ఉద్యోగి పరారవ్వడంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్నం జిల్లా మల్కాపురం పరిధిలోని 79వ వార్డు జనతా కాలనీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న దేముడిబాబు ఈ మోసానికి పాల్పడ్డాడు. అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ నిమిత్తం లబ్ధిదారులకు పంచాల్సిన రూ. 2.17 లక్షల నగదును ఆయన వద్ద ఉంచారు. అయితే దేముడిబాబు ఆ డబ్బుతో సహా సచివాలయం నుంచి అకస్మాత్తుగా పరారయ్యాడు. ఆయన ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన తోటి సిబ్బంది ఆరా తీశారు. డబ్బు కనిపించకపోవడంతో అవాక్కయిన అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి నాగరాజు వెంటనే స్థానిక మల్కాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజాధనాన్ని స్వాహా చేసిన వెల్ఫేర్ సెక్రటరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా, సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
రూ.2.17 లక్షల పింఛన్ డబ్బుతో ప్రభుత్వ ఉద్యోగి పరార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)