రోగి ప్రాణాలు కాపాడడంలో నర్సుల పాత్ర కీలకం : మంత్రి భరత్
కర్నూలులో టిఎన్‌ఎఐ 79వ రాష్ట్ర సదస్సు
ప్రజాశక్తి - కర్నూలు స్పోర్ట్స్ : నర్సింగ్ సేవలకు వెలకట్టలేమని, రోగుల ప్రాణాలు కాపాడడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కొనియాడారు. కర్నూలులోని ఎఎంఆర్ ఫంక్షన్ హాలులో సోమవారం ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టిఎన్‌ఎఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 79వ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ వైద్యులు చికిత్స అందిస్తే, నర్సులు రోగులకు నిరంతరం సేవలందిస్తుంటారని కొనియాడారు. ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కోవిడ్ సమయంలో అనేకమంది నర్సులు ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నర్సింగ్ సేవలకు గుర్తింపునిస్తూ, కోవిడ్ సమయంలో మృతి చెందిన నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ చదలవాడ శ్రీలక్ష్మి పేరిట ఏటా అందించే ఓరియంటేషన్ అవార్డును ఈ ఏడాది ఎపి ఎన్‌ఎంసి రిజిస్ట్రార్, ప్రొఫెసర్ కె సుశీలకు ప్రదానం చేశారు. ఆమెను మంత్రి భరత్ సన్మానించి అవార్డుతో పాటు నగదు బహుమతి అందజేశారు. టిఎన్‌ఎఐ రాష్ట్ర అధ్యక్షులు డి ఉషా పన్నగ వేణి, కార్యదర్శి కెవి శ్రీదేవి సదస్సు నిర్వహణ వివరాలను వెల్లడించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం భరత్‌ను నర్సింగ్ కళాశాలల అసోసియేషన్ నాయకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎంఆర్ పద్మావతి, కాన్ఫరెన్స్ ఆర్గనైజర్ శాంతి భవాని, విజయ వర్ధన్ రెడ్డి, విజయ రాఘవేంద్ర గౌడ్, హరి ప్రసాద్ రెడ్డి, ఖుద్దుస్, పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)