ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య, బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తదితరులు సోమవారం నాడు కమిషనర్ అనిల్ చంద్రా పునేఠాను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి భారీ కాన్వాయ్ తీశారని, ఆర్వో కార్యాలయం ముందు ధర్నా చేశారని, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఓటు వేయడానికి హెలికాఫ్టర్‌లో వచ్చి, కలెక్టరుతో ఏర్పాట్లు చేయించుకున్న జగన్.. ఓటు వేయనని వెనక్కి వెళ్లిపోవడం సరికాదన్నారు. ఓటు వేయకుండా నిరసన తెలపడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించారు. అలాగే విజయవాడ లయోలా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలోకి ఓటరు, అభ్యర్థి కాని దేవినేని అవినాష్ ఏ అధికారంతో ప్రవేశించారని ప్రశ్నించారు. వీరిపై వెంటనే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్‌ప్రసాద్, టిడిపి నేత గురజాల మల్యాద్రి తదితరులు ఉన్నారు.








కామెంట్‌లు (0)