21 జోన్లలో పనులు
ఇ-3 ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసార పరీక్షలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పరిధిలో సెక్రటేరియట్ టవర్లతోపాటు రోడ్లనూ గ్రిడ్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ కన్సార్టియం ఇచ్చిన మాస్టర్ ప్లాను ప్రకారం ప్రతి వెయ్యి ఎకరాలకూ ఒక గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో తూర్పు నుండి పడమరకు ఈ (ఈస్ట్) సిరీస్‌తో కూడిన రోడ్లు, ఉత్తరం నుండి దక్షిణం వరకూ ఎన్ (నార్త్) సిరీస్‌తో కూడిన 34 రోడ్లను నిర్మిస్తున్నారు. సుమారు 1,500 కిలోమీటర్లకు పైబడిన ఈ రోడ్లలో మేజర్ ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్, ఆర్టీరియల్, కలెక్టర్ రోడ్లను నిర్మిస్తున్నారు. ప్రధాన రోడ్లకు సంబంధించి ప్రసుత్తం 313 కిలోమీటర్ల దూరంతో కూడిన 41 రోడ్ల పనులు జరుగుతున్నాయి. వీటిల్లో ఇప్పటికీ ఈ3 రోడ్డు నిర్మించారు. దీనిలో రెండోదశ పూర్తయింది. మూడోదశ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం భూసార పరీక్షల దశలో ఉంది. మాస్టర్ ప్లాను ప్రకారం నిర్మిస్తున్న రోడ్లలో గ్రిడ్‌ను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఒక్క గ్రిడ్‌లో అంటే తూర్పు, ఉత్తరం వెళ్లే రెండు రోడ్ల మధ్యలో మొత్తం వెయ్యి ఎకరాలు (ఒక గ్రిడ్) ఉండేలా ప్లాను రూపొందించారు. నగరంలో ఎక్కడి నుంచైనా 5 నిమిషాలలో అత్యవసర సేవలు, 10 నిమిషాలలో పార్కులు, రిక్రియేషన్ కేంద్రాలు, 15 నిమిషాలలో పనిచేసే కార్యాలయాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లానులో పేర్కొన్నారు. ప్రసుత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకు మణిపాల్ ఆస్పత్రి వరకూ నిర్మించాల్సిన ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్లకు సంబంధించిన భూసార పరీక్షలు జరుగుతున్నాయి. వాటి నివేదిక వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎడిసిఎల్) అధికారులు తెలిపారు. గవర్నమెంటు కాంప్లెక్స్ పనులు పూర్తయ్యేలోపే రోడ్ల నిర్మాణ పనులూ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని, దానికనుగుణంగా పనులు చేపడుతున్నామని వివరించారు. ఇటీవల గ్రామాలను ప్రధాన రహదారులకు కలుపుతూ ఏర్పాటు చేయాల్సిన రోడ్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చామని, కొత్త రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. రోడ్లతోపాటు తక్షణ అవసరమైనచోట డ్రైనేజీ, నీటి సరఫరా, భూగర్భ యుటిలిటీ నెట్వర్క్, వీధి దీపాలు వంటివాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎడిసిఎల్ అధికారులు వివరించారు. రోడ్లన్నీ ఆరు వరుసల్లో నిర్మిస్తున్నారు. ప్రతి రోడ్డుకు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, అవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా వ్యవస్థ, సీవరేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్ట్స్ (విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్స్ భూగర్భంలో ఉండేలా), రీయూజ్ వాటర్ లైన్లు, స్ట్రీట్ ఫర్నీచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ1 రోడ్డును కరకట్ట రోడ్డుగా మార్చారు. ఈ3 రోడ్డును సీడ్ యాక్సెస్ రోడ్డుగా పరిగణిస్తున్నారు. మేజర్ ఆర్టీరియల్ రోడ్లుగా ఈ5, 13, ఎన్6, 13 మేజర్ ఆర్టీరియల్ రోడ్లుగా నిర్మిస్తున్నారు.







కామెంట్లు (0)