కేంద్ర బృందాన్ని కోరిన సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుపాను వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించేలా చూడాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4,526 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే కేంద్రానికి సమర్పించామని చెప్పారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని ఆర్‌టిజిఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రితో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర హోం, వ్యవసాయం, జలవనరులు, జాతీయ రహదారులు, ఆర్థిక విభాగాలకు చెందిన అధికారులు ఈ బృందంలో ఉన్నారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించిన విషయాన్ని కేంద్ర బృందం సభ్యులు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరి, కొబ్బరి, అరటి వంటి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు.
ఓ వైపు కరువు.. మరోవైపు తుపాను
వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన, ఆక్వా కల్చర్ వంటి వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయని సిఎం చంద్రబాబు తెలిపారు. మత్స్యకారుల పడవలకు సైతం నష్టం వాటిల్లిందన్నారు. అర్నబ్ తుపాను మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే మురసు తుపాను రాష్ట్రాన్ని తాకుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఎల్‌నినో వల్ల తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటుండగా, మరో ప్రాంతం తుపాను ప్రభావానికి గురవుతోందన్నారు.








కామెంట్‌లు (0)