సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నడూ లేనంత కరువు

1 గంట క్రితం

ఎన్నడూ లేనంత కరువు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 01:23 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • పంటలన్నీ పోయాయి

  • మీరే ఆదుకోవాలి

  • కేంద్ర కరువు బృందం ముందు రైతుల గోడు

  • ‘అనంత’కు రూ.2 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వండి : సిపిఎం విజ్ఞప్తి

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి, తుగ్గలి/మద్దికెర (కర్నూలు జిల్లా) : ‘ఎన్నడూ లేనంత కరువొచ్చింది. పంటలన్నీ కోల్పోయాం. తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. తీవ్ర కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ కేంద్ర కరువు బృందం ముందు రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు బృందం అనంతపురం జిల్లాలోని ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు మండలాల్లో, మరో బృందం కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో సోమవారం పర్యటించింది. రెండు ఎకరాల్లో కంది పంట సాగు చేస్తే మొత్తం ఎండిపోయిందని ఆత్మకూరు మండలం పంపనూరుకు చెందిన రైతు నాగన్న కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టానని, పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయిందని తెలిపారు. ఆముదం పంట సాగు చేసిన హరి కృష్ణ నాయక్‌ ‌పొలాన్ని కరువు బృందం సందర్శించింది. మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగుచేస్తే 50 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చిందని ఈ బృందం దృష్టికి రైతు తీసుకొచ్చారు. అదే గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద రైతులతో కేంద్ర బృందం సభ్యులు మాట్లాడారు. రామకృష్ణ అనే రైతు మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు ఇప్పటికే 125 రోజులు పూర్తయ్యాయని, మరిన్ని రోజులు పెంచాలని కోరారు. మనుషులకు తాగడానికి నీళ్లు, పశువులకు మేత ఇబ్బందికరంగా ఉందని రైతులు తెలిపారు. 700 అడుగులు బోరు వేసినా నీళ్లు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాడి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఉమాపతి చౌదరి అనే రైతు కేంద్ర కరువు బృందానికి వివరించారు. రూ.150 పలికే వరి గడ్డి రూ.300కు చేరిందని, దాణా బస్తాపై రూ.400 పెరిగిందని తెలిపారు. పశువులకు నీళ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. అనంతరం అంగన్‌‌వాడీ కేంద్రాన్ని కరువు బృందం సందర్శించింది.

అధికారులతో సమావేశం

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చిన్మయ్‌ ‌గోట్మారే నేతృత్వంలో వచ్చిన ఈ కేంద్ర బృందం ముందుగా అనంతపురం కలెక్టరేట్‌‌లోని రెవెన్యూ భవనంలో అధికారులతో సమావేశమైంది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు ఈ సమావేశానికి విచ్చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున నోడల్‌ అధికారిగా విచ్చేసిన వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ ‌జీలానీ సమూన్‌ మాట్లాడుతూ రాష్ర్టంలో మొత్తం 688 మండలాలుంటే, ఇందులో 283 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, 105 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావం వల్ల సుమారు 28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయని, దీనివల్ల 16.18 లక్షల టన్నుల ఆహార దిగుబడి తగ్గే అవకాశముందని వివరించారు. దీని నష్టం సుమారు రూ.6,062 కోట్లు ఉంటుందన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఆదుకునేందుకు రూ.1158.66 కోట్లు సహాయాన్ని కేంద్రం అందించాలని కోరారు. వర్షాభావం కారణంగా ఉ‌ద్యాన పంటలు దెబ్బతింటున్నాయని, వాటి రక్షణ కోసం రూ.46.81 కోట్లు, తాగునీటి అవసరాల కోసం రూ.17.47 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ.28.46 కోట్లు, పశుగ్రాసం, పాడి పశువుల రక్షణ కోసం రూ.168.84 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా రాష్ట్రానికి రూ.1420.26 కోట్లు సహాయం అవసరమని కేంద్ర కరువు బృందం సభ్యులకు ఆయన వివరించారు.

రైతులను ఆదుకోండి : సిపిఎం వినతి

అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచు‌కుని జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలను ఆదుకునేందుకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ... కేంద్ర కరువు బృందాన్ని కోరింది. ఈ మేరకు కరువు బృందం సభ్యులను కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటించాలని, సాగు చేసిన పంటలకు ఎకరానికి రూ.50 వేలు, సాగు చేయలేక బీడుగా వదిలేసిన భూములకు ఎకరానికి రూ.20 వేలు పరిహారం చెల్లించాలని కోరింది. కౌలు రైతులను గుర్తించి వారికే నష్టపరిహారం అందించాలని, రైతుల అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, ఉద్యాన పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విబి గ్రామ్‌ ‌జి పథకం కింద ప్రతి కుటుంబానికీ 200 రోజుల పని, రోజుకు రూ.600 వేతనం కల్పించాలని, వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, చేతివృత్తిదారులకు నెలకు రూ.10 వేల కరువు భృతి ఇవ్వాలని కోరింది. వినతిపత్రం ఇచ్చిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.నాగేంద్ర కుమార్, ఎం.బాలరంగయ్య, ఆర్.చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, ఎపి రైతు సంఘం నాయకులు సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.

ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వండి

భారత ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆయిల్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.పొన్నుసామి నాయకత్వంలోని కేంద్ర బృందం కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర మండలాల్లో పర్యటించింది. చెరువు తాండా, యర్రగుడి, పెరవలి గ్రామాల్లో పంటలు, చెరువులు, సాగునీటి వనరులను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించింది. తుగ్గలి ప్రాంతంలో కంది, శనగ, మినుములు, ఆముదం, వేరుశనగ, టమాటా, సజ్జ తదితర పంటలను వర్షాధారంగా సాగు చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గతంలో ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఈ ఏడాది వర్షాభావం, భూమిలో తేమ తగ్గడం, నీటి తడులు అందించలేకపోవడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయని, పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఎకరాకు కనీసం రూ.50 వేల పరిహారం అందించాలని కోరారు. మద్దికెర మండలం పెరవలి గ్రామంలో రైతు సుధాకర్‌ సాగు చేసిన ఆముదం, రామాంజనేయులు సాగు చేసిన ఉల్లి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. ఎండిపోయిన పత్తి, సజ్జ, మిరప పంట మొక్కలను పరిశీలించి కరువు ప్రభావాన్ని అంచనా వేసింది. పత్తికొండ మండలం చిన్న హుల్తీ, జూటూరు గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడింది. ఈ పర్యటనలో రాష్ట్ర నోడల్‌ అధికారి, డబ్ల్యుసిడిఎం డైరెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, నీతి ఆయోగ్‌ సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ అనురాధ బటానా, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అండర్‌ సెక్రటరీ ప్రదీప్‌ కుమార్‌, కేంద్ర పశుసంవర్ధక శాఖ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాక్షి భదౌరియా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్