సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదూసుకొస్తున్న మురసు..

1 గంట క్రితం

Severe impact of the cyclone on Nellore and Prakasam districts
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 01:05 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం
• కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక

ప్రజాశక్తి - యంత్రాంగం : మురసు తుపాను దూసుకొస్తోంది. తుపాన్‌ ‌ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగాపలు జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తుపాన్‌ ‌ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు. 12 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఈ తుపాన్‌ ‌మంగళవారం తెల్లవారు జామున తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నివారణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

నెల్లూరు నగరంలో గాలులకు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో వద్ద భారీ వృక్షం కూలి పడటంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రకాశం జిల్లా శింగరాయకొండలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కొత్తపట్నం, శింగరాయకొండ మండలం పాకల, ఊళ్లపాలెం సముద్ర తీరం వద్ద అలల ఉధృతి తీవ్రంగా ఉంది. ఊళ్లపాలెం సముద్ర తీరంలో పడవలు సముద్రపు అలల నీటిలో తేలాడుతున్నాయి. వాటిని సురక్షితంగా ఒడ్డుకు తేవడానికి మత్స్యకారులు ప్రయత్నిస్తున్నారు. పాకల సముద్ర తీరం వద్ద అలలు భారీగా ముందుకొచ్చాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. పాలకొల్లు, ఆచంట, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అర్నబ్‌ ‌తుపాన్‌ ‌తాకిడికి విద్యుత్‌ ‌స్తంభాలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు ‌సరఫరా ఇంకా పునరుద్ధరణ కాలేదు. ఈ నేపథ్యంలో మురసు తుపానుతో ఆందోళన వ్యక్తమవుతోంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని పిఎంలంక, పేరుపాలెం తదితర తీరప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.

పలాసలో 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలాసలో అత్యధికంగా 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలో వర్షాలు పడ్డాయి. భారీ వర్షానికి విజయనగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాటిపూడి రిజర్వాయర్ కు పైనుంచి నీరు ఎక్కువగా రావడంతో రెండు గేట్లు ఎత్తివేసి నీటికి దిగువకు విడుదల చేశారు. తిరుపతి జిల్లాలో పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, ఏర్పేడు రేణిగుంట, తిరుపతి అర్బన్ రూరల్ మండలాల్లో ముసురు వర్షాలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా దక్షిణ కోస్తా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఇండిగో సంస్థకు చెందిన పది విమాన సర్వీసులు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కు చెందిన రెండు సర్వీసులు రద్దయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్