అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లు అడ్డుకోవడం దారుణం
అల్లూరి జిల్లాలో 17 ఎంపిటిసి స్థానాలను అన్రిజర్వ్డ్కు కేటాయించడం తగదు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి: వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి - చింతపల్లి (అల్లూరి జిల్లా) : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చిన ఆయన చింతపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ, అభ్యర్థులను బరిలో నిలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి ప్రభుత్వం పలు ప్రాంతాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుందని విమర్శించారు. సిపిఎం అభ్యర్థిని సైతం గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ప్రజలు వెంట ఉంటే ఓట్ల ద్వారా గెలుపొందాలి తప్ప, ప్రత్యర్థి అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు వేయనీ యకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు, రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుత కూటమి పార్టీకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతమైన అల్లూరి జిల్లాలో 17 ఎంపిటిసి స్థానాలను అన్రిజర్వ్డ్గా ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ విధానం ఆదివాసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని విస్మరించడమేనని పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో సిపిఎం జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్, చౌడుపల్లి ఎంపిటిసి అభ్యర్థి కిల్లో సింహాచలం, చిరంజీవి, రాంబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)