డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ ఆదేశించారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి సమస్యలను స్వయంగా తెలుసుకుంటానన్నారు. ఉప్పాడ తీర రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్, డిపిఆర్ పనులు వేగవంతం చేసి త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. కోనపాపపేట వరకు గోడ పొడిగింపు ప్రతిపాదనలకు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను తరలించి 102 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించిన అధికారులను అభినందించారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని, ఇళ్లు, పంటలు, పడవలు, వలలకు జరిగిన నష్టాన్ని త్వరగా అంచనా వేసి పరిహారం అందించాలని ఆదేశించారు. సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్‌పి బిందు మాధవ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ, ఎపిఇపిడిసిఎల్ సిఎమ్‌డి పృధ్వితేజ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)