నావిగేషన్ వ్యవస్థ బలోపేతానికి కక్ష్యలోకి ఎన్‌విఎస్-03
13 ఏళ్ల పాటు సేవలందించనున్న ఉపగ్రహం
ప్రజాశక్తి- తిరుపతి : తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి శుక్రవారం అర్ధరాత్రి 11.55 గంటలకు జిఎస్‌ఎల్‌వి-ఎఫ్18 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ చారిత్రాత్మక మిషన్ ద్వారా భారతదేశానికి చెందిన రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహం ఎన్‌విఎస్-03 ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఇది భారతదేశపు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రోగ్రామ్‌లో 20వ ప్రయోగం. సుమారు 50 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉన్న ఈ త్రిదశ రాకెట్ 2,232 కిలోల బరువుగల ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా భారతదేశపు సొంత జిపిఎస్ వ్యవస్థ అయిన నావిక్ మరింత బలోపేతం కానుంది. ఎన్‌విఎస్-03 ఉపగ్రహంలో భారతదేశం సొంతంగా తయారు చేసిన అత్యంత కచ్చితమైన రుబిడియం అటామిక్ క్లాక్ ను అమర్చారు. ప్రస్తుతమున్న ఎస్5, ఎస్ బ్యాండ్ సిగ్నల్స్‌తో పాటు, సాధారణ పౌరుల మొబైల్స్, స్మార్ట్ వాచ్‌లలో నావిగేషన్ సపోర్ట్ చేసేందుకు వీలుగా కొత్తగా ఎల్1 సిగ్నల్ బ్యాండ్‌ను కూడా ఇందులో చేర్చారు. భారత రక్షణ దళాలు నావిక్ వ్యవస్థను మరింత సురక్షితంగా వాడుకునేలా ఈ ఉపగ్రహంలో అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ సిస్టమ్ ను అమర్చారు. దీనివల్ల శత్రు దేశాలు మన సిగ్నల్స్‌ను జామ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదు. సాధారణంగా నావిగేషన్ ఉపగ్రహాల జీవిత కాలం ఏడు నుండి పది ఏళ్లు ఉంటుంది. కానీ, ఎన్‌విఎస్-03 ఉపగ్రహాన్ని మెరుగైన ‘ఐ-2కే’ బస్ కాన్ఫిగరేషన్‌తో రూపొందించడం వల్ల ఇది అంతరిక్షంలో 13 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవలు అందించనుంది. ఇస్రో చరిత్రలోనే మొదటిసారిగా అంతరిక్ష నౌకకు సంబంధించిన పైరో వాల్వ్స్ ముందే ఓపెన్ చేసి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. గతంలో ఎన్‌విఎస్-02 మిషన్‌లో ఎదురైన సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు.







కామెంట్‌లు (0)