అల్యేనియా పార్లమెంట్ వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్షం
టిరానా: అల్బేనియా రాజధాని టిరానాలో ప్రతిపక్ష సభ్యులు గురువారం పార్లమెంటు సమావేశాన్ని అడ్డుకున్నారు. సభలో పొగ బాంబులు ప్రయోగించారు. ప్రభుత్వ వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలను ప్రధాని విస్మరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రధానమంత్రి ఎడి రామా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులకు మద్దతుగా డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ అల్బేనియా నేత సాలీ బెరీషా, ఇతర ప్రతిపక్ష సభ్యులు సభలోకి దూసుకెళ్లారు. దేశ కేంద్ర బ్యాంకును నియంత్రించే కొత్త చట్టంపై జరగాల్సిన ఓటింగ్‌ను అడ్డుకున్నారు. ‘‘వీళ్లు (అధికార పక్ష సభ్యులు) నేరస్థులు. టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, పగిలిన తలలు, విరిగిన ఎముకలు వీరికి తగినవి. యువతకు కాదు’’ అని బెరీషా అన్నారు. బెరీషా సభలో మాట్లాడుతుండగా, రబ్బరు బుల్లెట్ల వల్ల గాయపడ్డారని చెబుతున్న ఆందోళనకారుల ఫొటోలను పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో సభకు అంతరాయం కలిగింది.
పార్లమెంట్‌కు తాకిన నిరసనల సెగ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్‌కు ప్రధాని ఎడి రామా ఓ విలాసవంతమైన రిసార్ట్‌ను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది మేలో మోదలైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. విద్యార్థుల నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమం క్రమంగా విస్తరించింది. ప్రభుత్వ అవినీతి, విద్యా ప్రమాణాలు లోపించడం, అధిక ట్యూషన్ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తారు. అల్భేనియా మునుపెన్నడూ లేని విధంగా అట్టుడికిపోతుంది.








కామెంట్‌లు (0)