- ఆర్ఎస్ వర్థంతి సభల్లో నేతలు
ప్రజాశక్తి - భీమవరం : జన హృదయాల్లో నిలిచిన ప్రజా నాయకుడు సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ (ఆర్ఎస్) అని పలువురు నేతలు కొనియాడారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల శనివారం ఆర్‌ఎస్ ద్వితీయ వర్థంతి సభలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, పాలకొల్లు, యలమంచిలి మండలం చించినాడ, ఏలూరు జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ, పేదలు, కార్మికులు, కర్షకులు, దళితుల హక్కుల కోసం తన జీవితాన్ని ఆర్‌ఎస్ అంకితం చేశారని వ్యక్తలు కొనియాడారు. ఆ రోజుల్లో భూస్వాములు, జమీందార్ల గుండెల్లో ఆయన సింహస్వప్నంలా నిలిచారన్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని అరెస్టు అయిన సమయాల్లోనూ చేతులకు సంకెళ్లతోనే కోర్టుకు హాజరవుతూ ప్రజాపోరాటాలను నడిపిన ధీరుడు ఆర్ఎస్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ, ప్రజా సమస్యలపై పోరాడటమే ఆర్‌ఎస్‌కు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. చిన్ననాటి నుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఆయన ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. సిపిఎం ఎమ్మెల్యేగా, శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసిన సమయంలో ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడారని తెలిపారు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంత గిరిజనుల హక్కుల పరిరక్షణకు అండగా నిలిచి, 1/70 చట్టం అమలు కోసం పెద్ద ఎత్తున గిరిజన ఉద్యమాలను నిర్మించారని తెలిపారు. సభల్లో ఆర్‌ఎస్ స్వగ్రామమైన యలమంచిలి మండలం చించినాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి బలరాం, రాష్ట్ర నేత మంతెన సీతారాం, పాలకొల్లులో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, నేత ఎ రవి, భీమవరంలో సిపిఎం సీనియర్ నేత జుత్తిగ నరసింహమూర్తి, తాడేపల్లిగూడెంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, తణుకులో పివి ప్రతాప్, జంగారెడ్డిగూడెంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.







కామెంట్‌లు (0)