- జమున మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
- బాధ్యత వహించి గిరిజన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలి : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- ఎటపాక (పోలవరం జిల్లా) : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గొల్లగుప్ప గ్రామంలో పర్యటించి క్లోరోక్విన్ బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన పోలవరం జిల్లా ఎటపాక మండలం విస్సాపురం గ్రామ పంచాయతీ గొల్లగుప్ప గ్రామంలో పర్యటించారు. ఇటీవల మలేరియా నివారణ కోసమంటూ ఆరోగ్య శాఖ ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న తరువాత మరణించిన గిరిజన బాలిక మడివి జమున కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘నాకు నాలుగు మాత్రలు ఇచ్చారు’ అని తమ కూతురు తెలిపిందని, అవే తన చిన్నారి చివరి మాటలని జమున తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ జమున మరణం తర్వాత ప్రభుత్వం నుండి ఏ హామీ రాలేదని, ఏ అధికారీ తమ గ్రామాన్ని సందర్శించి తమతో మాట్లాడలేదని తెలిపారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జమున మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వ అధినేతలు తలుచుకుంటే ఈపాటికి వారి కుటుంబానికి న్యాయం జరిగి ఉండాలి, కానీ అలా జరగకపోవడం శోచనీయమన్నారు. పవన్ కల్యాణ్ తక్షణమే గొల్లగుప్ప గ్రామాన్ని సందర్శించి జమున కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఉండి అడవి తల్లికి బాట వేస్తున్నానంటూ ప్రచారం చేసుకోవడం కాదు... నిజంగా గిరిజనులను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మారుమూల గ్రామాలకు రోడ్లు వేయించాల న్నారు. రోడ్లు వేయడానికి, విద్యుత్తు సదుపాయం కల్పించడానికి అటవీ శాఖ నుంచి అభ్యంతరం లేకుండా చూడాలని సూచించారు. క్లోరోక్విన్ డ్రగ్‌ను ప్రపంచంలోని అన్ని దేశాలూ బ్యాన్ చేశాయని, ఏజెన్సీలో మాత్రం వాటిని విచ్చలవిడిగా ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, ఆ మాత్రలే గిరిజన బాలిక మృతికి కారణమయ్యాయని వివరించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని పేర్కొన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మాత్రలు మింగి బాలిక మృతి చెందినది కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఒ గొల్లగుప్ప గ్రామంలో పర్యటించకుండా, జమున కుటుంబాన్ని పరామర్శించకుండా, బాధితులతో మాట్లాడకుండా వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఇటీవల మలేరియాతో మరణించిన పద్దం రోజా డెత్ సర్టిఫికెట్‌ను వైద్య సిబ్బంది తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జమున మృతదేహానికి అర్ధరాత్రి పోస్టుమార్టం చేయించడం, గ్రామంలోకి సిపిఎం నాయకత్వాన్ని వెళ్లనీయకుండా అడ్డుకోవడం, పోలీసుల పహారాతో హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలని అర్థమవుతోందన్నారు. జమున కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గ్రామానికి రోడ్లు వేయాలని, విద్యుత్తు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలకు రహదారి, విద్యుత్తు, మంచినీరు, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతని, కానీ అధికార యంత్రాంగం, పాలకులు ఆ బాధ్యత నుంచి పక్కకు తప్పుకోవడం సరికాదన్నారు. జమున కుటుంబానికి న్యాయం చేయకుంటే ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజులు, జిల్లా కమిటీ సభ్యులు ఐ.వెంకటేశ్వర్లు, విఆర్.పురం ఎంపిపి కారం లక్ష్మి, ఎటపాక మండల కార్యదర్శి కాకా అర్జున్, ఆదివాసీ అడ్వకేట్ మడివి రవితేజ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)