శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజరాత్‌లో కాగితపు పార్టీలకు కోట్లు కుమ్మరింత

1 గంట క్రితం

san
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:19 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- కార్యాలయాలకు నోచుకోనివాటికీ భూరి విరాళాలు

- కాకిలెక్కల ఖర్చులతో రూ.కోట్లు కాజేత

- బిబిసి పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు

న్యూఢిల్లీ : గుజరాత్‌లో ఎన్నికల విరాళాలకు సంబంధించి మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టురు అయ్యి కేవలం కాగితాలకే పరిమితమై..ఎటువంటి కార్యాలయాలు కూడా నిర్వహించని పార్టీలు రూ.వందల కోట్లు మేర విరాళాలుగా అందుకున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి బిబిసి వార్తా సంస్థ ఒక పరిశోధన చేపట్టింది. బిజెపి తదితర గుర్తింపు పొందిన పక్ష‍ాలు మిహానియిస్తే అత్యధిక మొత్తంలో ఏ పార్టీకి విరాళాలు అందాయనే కోణంతో మొదలైన ఆ పరిశోధనలో విస్మయకర వాస్తవాలు అనేకం బయటపడ్డాయి. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరయినా..కనీసం కార్యాలయం కూడా నిర్వహించని పార్టీలకు సైతం రూ.వందల కోట్లు విరాళాలుగా అందాయి. ఆ విరాళాల సొమ్మును ఏమైనా ఎన్నికల కోసం ఖర్చు చేశారా అంటూ ఆయా పార్టీలు నివేదించిన ఖర్చులు వివరాలు చూస్తే విస్మయం చెందక మానరు. ఒకటీ అరా స్థానాల్లో పోటీ చేసిన పార్టీలు సైతం కరపత్రాల కోసం రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు కాకిలెక్కలు చూపాయి. వీటి మూలాలు కూడా బిజెపితోనే అనుబంధంగా ఉండటం గమనార్హం. అయితే ఇదంతా పెద్ద కుంభకోణమని, పాలక పెద్దలు కార్పొరేట్‌ కంపెనీలు, కార్పొరేట్‌ అధిపతులకు ప్రజల సంపదను దోచిపెడుతూ అందుకు ప్రతిగా ముడుపులు తీసుకునేందుకు ఇలా పార్టీల ముసుగేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అసహ్యకర కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కుంభకోణాన్ని తలపించేలా గుజరాత్‌లో ఆరు పార్టీలకు విరాళాలు అందాయి. బిబిసి కథనం ప్రకారం..

ఈ ఆరు పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను పెద్దగా నిలబెట్టకపోయినా భారీ స్థాయిలో విరాళాలను సేకరించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా రూ. 1,700.78 కోట్లు ఆర్జించాయి. ఇది బిజెపిని మినహాయించి మిగిలిన ఐదు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం కంటే కనీసం రూ. 200 కోట్లు అధికం కావడం విశేషం. 2023-24లో బిజెపి మినహా మిగిలిన ఐదు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, ఆప్, బిఎస్‌‌పి, నేషనల్ పీపుల్స్ పార్టీ.. మొత్తం విరాళాలు రూ. 1,480.43 కోట్లు మాత్రమే. వివాదస్పద రీతిలో విరాళాలు అందుకున్న ఆరు పార్టీలలో నాలుగు పార్టీలు అహ్మదాబాద్‌కు చెందినవనిగానూ, మరో రెంటిండింటికి గుజరాత్‌లో ఇతర ప్రాంతాలలో ప్రధాన కార్యాలయాలను ఉన్నాయని వెల్లడయింది. 2019 నుండి 2024 మధ్య సంవత్సరాలలో వీటి మొత్తం ఆదాయం రూ. 2,316 కోట్లు అని కూడా నివేదిక పేర్కొంది. 2022-23తో పోలిస్తే 2023-24లో నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీల ఆదాయం 223 శాతం పెరిగింది.

- ఆరు వివాదస్పద పార్టీల్లో ఒకటైన ఆమ్‌ జన్మత్‌ పార్టీకి 2023-24లో అత్యధికంగా రూ. 620 కోట్లు విరాళాలు లభించాయి. అంతకు ముందు ఏడాది ఈ విరాళాలు రూ. 216 కోట్లుగా ఉన్నాయి. అయితే ఈ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క అభ్యర్థిని బరిలోకి దింపింది. దీనిని తొలుత 2020లో పాట్నాలో అనామిక పాశ్వాన్ అధ్యక్షతన స్థాపించారు. తరువాత అహ్మదాబాద్‌‌కు తరలించారు. పాశ్వాన్ ప్రస్తుతం బీహార్‌‌లో బిజెపి ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

- ఇక రెండోది.. సత్యవాది రక్షక్ పార్టీ విరాళాల రూపంలో రూ. 330.55 కోట్లు అందుకుని రెండో స్థానంలో నిలిచింది. ఎన్నికల సంఘానికి అందచేసిన ఆడిట్ నివేదిక ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రూ. 8.48 కోట్లు, సామాజిక సంక్షేమ ప్రాజెక్టులకు రూ. 316 కోట్లు ఈ పార్టీ ఖర్చు చేసింది. అయితే ఈ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థినే నిలబెట్టింది.

- ఆ తర్వాత స్థానాల్లో స్వతంత్ర అభివ్యక్తి పార్టీ రూ. 219.69 కోట్లు, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ రూ. 200.69 కోట్లు, భారతీయ నేషనల్ జనతా దళ్ రూ. 191.61 కోట్లు, గరీబ్ కళ్యాణ్ పార్టీ రూ. 138 కోట్లు విరాళాలుగా సేకరించాయి.

- ఈ ఆరు పార్టీల కార్యాలయాలు మూసివున్నట్లుగా బిబిసి తన కథనంలో పేర్కొంది.

- 2024 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీలన్నీ కలిసి మొత్తంగా కేవలం 15 మంది అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపాయి. నిజానికి ఈ పార్టీలన్నీ 2018 తరువాతే ఏర్పాటయ్యాయి. అప్పటి నుంచి వీటిది ఇదే తీరు. 2019 నుండి 2024 వరకూ రెండు లోక్‌సభ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఎన్నిక జరగ్గా, వీటిల్లో కేవలం 17 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపాయి. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు, కేవలం కాగితాలకే పరిమితమైన పార్టీలకు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందడం కచ్చితంగా మనీ లాండరింగ్‌ ‌వ్యవహారమేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం ఎన్నికల ముందే పుట్టి ఎన్నికల తర్వాత వాటి కార్యకలాపాలు కనుమరుగవుతున్న కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ పేరు చెప్పి వందల కోట్ల విరాళాలు ఆర్జించడం అంత సులువైన వ్యవహారం కాదంటున్నారు.

pos



scam


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్