శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భవిష్యత్‌ నిర్మాతలు టీచర్లే

58 నిమిషాల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎఐ వచ్చినా వారి స్థానం భర్తీ కాదు

- ప్రతి పాఠశాలకూ ఓ బ్రాండ్‌ ఉండాలి

- ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యార్థులను భవిష్యత్‌ ప్రపంచానికి సిద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కోర్సులను రీ స్ట్రక్చరింగ్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ‌హాల్‌‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎం ప్రసంగించారు. ఎఐ వంటి వ్యవస్థలొచ్చినా ఉపాధ్యాయుల స్థానాన్ని భర్తీ చేయలేదని పేర్కొన్నారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై మరింత పెరిగిందని చెప్పారు. చదువు కేవలం సిద్ధాంతం రూపంలోనే కాకుండా ఆచరణాత్మకంగా కూడా ఉండాలని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకనుగుణంగా విద్యా విధానం ఉండాలన్నదే తన ఆలోచన అని వెల్లడించారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలలను ప్రత్యేక బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల ప్రభావంతో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన ప్రిన్సిపల్‌ హత్య, విజయనగరంలో తల్లిని హత్యచేసిన కొడుకు ఘటన వంటి అంశాలను ఆయన ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యాబోధన సవాళ్లతో కూడిన అంశంగా మారిపోయిందన్నారు. గతంలో దండనతోనైనా పాఠాలు నేర్పించేవారని, ఇప్పుడు కనీసం తిట్టినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సున్నితమైన పరిస్థితుల మధ్య ఉపాధ్యాయులు వివేకంతో ఆలోచించి వ్యవహారాన్ని చక్కబెట్టాలని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివేలా ప్రోత్సహించాలని, ఆవిష్కరణలు, సృజనాత్మకత, కష్టాలను ఎదుర్కొనే తత్వాన్ని వారిలో పెంచాలని సూచించారు. ప్రతి పాఠశాలా మోడల్‌ స్కూల్‌గా మారితే కుటుంబాలు, గ్రామాలు, చివరకు దేశం మారుతుందని చెప్పారు. క్రీడలు, ప్రకృతితో విద్యార్థులను అనుసంధానం చేయాలని, ప్రతి శనివారం నో బ్యాగ్‌ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటే, రాష్ట్రం దేశంలో నెంబర్‌ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ఆ లక్ష్యానికి పునాది పాఠశాలల్లోనే పడాలని, దాన్ని సాధించేది ఉపాధ్యాయులేనని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జనాభా నిర్వహణపై మాట్లాడాలన్నారు. ఉత్తర భారతదేశంలో జనభా పెరుగుతుంటే దక్షిణ భారతదేశంలో తగ్గుతుందన్నారు. సంతానోత్పత్తి 2.1 శాతంగా ఉండాలన్నారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశాన్ని సభలో ప్రకటించారు.

​2029 నాటికి మరో మూడు డిఎస్‌‌సిలు : మంత్రి లోకేష్‌

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేది ఉపాధ్యాయులే అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మెగా డిఎస్‌‌సి-2025ను పారదర్శకంగా నిర్వహించినట్లే 2029 నాటికి మరో మూడు డిఎస్‌‌సిలు నిర్వహిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌కు ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో లీప్ మోడల్ స్కూల్‌ను అభివృద్ధి చేశామని, ఆ మోడల్‌ను రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి తీసుకొచ్చి, చివరకు మోడల్ ప్రైమరీ స్కూల్ వరకు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. యూనివర్సిటీలకు యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలన్నది తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 175 మందిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ సత్కరించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్‌ ‌భరత్‌ గుప్తా, ఇంటర్మీడియట్‌ ‌బోర్డు కార్యదర్శి రంజిత్‌ ‌బాషా, పాఠశాల విద్య డైరెక్టర్‌ ‌తమీమ్‌ అన్సారియా, సమగ్రశిక్ష డైరెక్టర్‌ ‌బి శ్రీనివాసరావు, ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్