శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పుస్తెలమ్మైనా పులసే కావాలంటూ పోటీ.. యానాంలో రికార్డు ధర !

1 గంట క్రితం

A scramble to secure the prized 'Pulusu' fish—even at the cost of selling one's wedding necklace—leads to a record price in Yanam!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 12:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

యానాం : రుచిలో రారాజుగా పేరొందిన గోదావరి పులస చేపకు ఉన్న క్రేజే వేరు ..! పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని యానాం రేవులో నిర్వహించిన బహిరంగ వేలంలో పులస చేప ఏకంగా రూ.24 వేల రికార్డు ధర పలికింది. కేవలం 1.300 కిలోల బరువున్న ఒక్క మగ పులస చేపకు ఈ స్థాయిలో ధర రావడం ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


యానాం మత్స్యకారుల వలకు చిక్కిన రెండు పులస చేపలను శుక్రవారం రేవులో బహిరంగ వేలానికి ఉంచారు. ఇందులో 1.300 కిలోల బరువున్న పెద్ద మగ పులస చేపను స్థానిక మత్స్యకార మహిళ పార్వతి రూ.24 వేలుకు దక్కించుకున్నారు. మరో చిన్న పులస చేపను రూ.7,500కు కొనుగోలు చేశారు. ఇలా రెండు చేపల కోసం ఆమె మొత్తం రూ.31,500 వెచ్చించడం విశేషం. ఈ ఏడాది మగ పులస చేపకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.


పులసకు ఎందుకింత ప్రత్యేకత ?

బంగాళాఖాతంలోని ఉప్పునీటిలో నివసించే ఇలస చేపలు సంతానోత్పత్తి కోసం వర్షాకాలంలో గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి. ఎర్రటి వరద నీటికి ఎదురీదుతూ నదిలోకి ప్రయాణించే ఈ చేపలు తీపి నీటిలోకి చేరిన తర్వాత వాటి రుచి, శరీర నిర్మాణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. గోదావరి మట్టితోపాటు నదీ పరిసరాల్లో లభించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలస చేప క్రమంగా అత్యంత రుచికరమైన పులసగా మారుతుందని మత్స్యకారులు చెబుతుంటారు. గోదావరి నదిలో మరింత లోపలికి వెళ్లేకొద్దీ పులస రుచి మరింత పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే ఈ చేప కోసం మాంసాహార ప్రియులు ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడుతుంటారు.


తగ్గిన లభ్యత.. పెరిగిన ధరలు ..!

సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు ఉధృతంగా వచ్చే సమయంలో పులస చేపలు ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో గోదావరికి వరద నీరు ఆలస్యంగా చేరడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపల లభ్యత గణనీయంగా తగ్గింది. మత్స్యకారుల వలలకు అరుదుగా ఒకటి, రెండు చేపలు మాత్రమే చిక్కుతుండటంతో మార్కెట్‌లో పులసకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దొరికిన కొద్ది చేపలను సొంతం చేసుకునేందుకు వ్యాపారులు, మాంసాహార ప్రియులు పోటీపడుతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడమే పులస ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధాన కారణంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్