మోడీ సర్కారు వైఫల్యాన్ని నిలదీసిన మృతుని భార్య
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో, ములగాడ : ఇటీవల ఒమన్ తీరంలో ఎంటి సెట్టెబెల్లో నౌకపై అమెరికా చేసిన దాడిలో మృతి చెందిన విశాఖకు చెందిన సీనియర్ మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ (44) మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం ఉదయం విశాఖ నగరంలోని శ్రీహరిపురం సమీప శ్రీనివాస నగర్‌కు చేరుకుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో ఆయన కుటుంబ సభ్యులు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రంలా మారింది. సురేష్‌ను ఉంచిన శవపేటిక వద్ద అందరూ ఘన నివాళ్లర్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్ర అశ్రునయనాల నడుమ సాగింది. కోరమండల్ స్మశాన వాటికలో అంత్యక్రి యలు జరిగాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రి యలు జరగకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
సొంత ఖర్చులతోనే భౌతికకాయం తరలింపు
హైదరాబాద్ నుంచి తమ సొంత ఖర్చులతో భౌతికకాయాన్ని తీసుకొచ్చామని సురేష్ కుటుంబసభ్యులు తెలిపారు. నౌకపై అమెరికా దాడిలో సురేష్, మరో ఇద్దరు భారతీయ నావికులు దుర్మరణం చెందారు. ఈ నెల పదిన దాడి ఘటన జరగగా సురేష్ మృతి విషయాన్ని 11న అధికారులు ధ్రువీకరించారు. ఆయన కుటుంబం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటోంది. సురేష్ కొద్ది రోజుల్లోనే పెళ్లిరోజు వేడుకలకు ఇంటికి రావాల్సి ఉండగా అంతలోనే విషాదం నెలకొంది. దీంతో, కుటుంబసభ్యులు, బంధువులు శోకసం ద్రంలో మునిగిపోయారు. సురేష్‌కు భార్య భార్గవి, 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.
పలువురు నివాళి
ఘటన విషయం తెలిసిన వెంటనే తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని మృతుని భార్య భార్గవి ప్రభుత్వ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. పలు ప్రక్రియల తరువాత గురువారం రాత్రికి ఘటన జరిగిన ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు విమానంలో సురేష్ భౌతికకాయం చేరుకుంది. అక్కడి నుండి అంబులెన్స్ లో శుక్రవారం ఉదయం శ్రీహరిపురం సమీప శ్రీనివాస్ నగర్ కు తీసుకొచ్చారు. ఆయన భౌతికకాయం వద్ద ప్రభుత్వ విప్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిజివిఆర్.నాయుడు (గణబాబు), ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు నివాళ్లర్పించారు.
నావికుల మృతిపై స్పందన ఇలాగేనా?
‘దేశం కోసం ప్రాణాలర్పించిన నావికులపై పాలకుల స్పందన ఇలాగేనా? భారతీయ సిబ్బంది ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి?’ అని సురేష్ భార్య భార్గవి కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఓవైపు రోదిస్తూనే పాలకుల తీరును ఆమె ప్రశ్నించారు. ‘ప్రమాదంలో ముగ్గురు భారతీయ నావికులు మరణించినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ శ్రద్ధ వహించింది? ఎక్కడ స్పందించింది? నేను నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)ను ప్రశ్నిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం అందిస్తారు? ఇదే ప్రశ్న నేను అమెరికా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. నా భర్తే మా కుటుంబానికి జీవనాధారం. ఇప్పుడు ఆయన లేకపోతే నేను నా పిల్లలను ఎలా పెంచాలి?’ అంటూ ఆమె బాధాతప్త హృదయంతో ప్రశ్నించారు.
సమగ్ర విచారణకు కార్మిక సంఘాల డిమాండ్
సురేష్ భౌతికకాయం వద్ద ఫార్వర్డ్ సీమన్ యూనియన్ ఆఫ్ ఇండియా నాయకులు విఎస్.పద్మనాభరాజు, వాటర్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు బి.జగన్, సిఐటియు నాయకులు లక్ష్మణమూర్తి, పైడిరాజు, పెంటారావు నివాళ్లర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పద్మనాభరాజు మాట్లాడుతూ యుద్ధంతో ఎలాంటి సంబంధమూ లేని అమాయక భారతీయ సీమన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను దేశ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.









కామెంట్‌లు (0)