మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition పొగాకు రైతుల వంద రోజుల పోరాటం

1 గంట క్రితం

tobaco farmers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రైతు పోరాటాలు వంద రోజులు దాటితేగాని సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు కదలడం లేదు. గత రెండు సంత్సరాలలో నల్ల బర్లీ పొగాకు, శనగ, మొక్కజొన్న, ఉల్లిపాయలు, పాడి రైతులు సుదీర్ఘకాలం పోరాడితేగాని పాలక వర్గాలు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వాలకది అలవాటుగా మారింది. ఈ వారం రోజులలో మీడియా లీకులు చూస్తుంటే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రత్యేక శ్రద్ధతో ఢిల్లీ అధికార పీఠంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ప్రధానంగా రైతులకు వడ్డీ లేని రుణాలు, రుణాలు చెల్లింపు వాయిదా వేయటం, ధరల వ్యత్యాస పథకం అమలు లాంటివి కనిపించాయి.

అసలు సమస్య అయిన పొగాకు కొనుగోళ్లను పట్టించుకోలేదు. కేజీ పొగాకు సరాసరిన రూ.250కు కొనిపించడమో లేదా రూ.1000 కోట్లతో ప్రభుత్వ సంస్థలతో కొనిపించడమో జరగాలి. అలా గాకుండా వాటిని పక్కన పెట్టటం చూస్తుంటే ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి వుందా అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది.

రెండు సంవత్సరాల క్రితం మిర్చి కొనుగోలు సంక్షోభంలో పడినపుడు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా... క్వింటా రూ.11,870 కన్నా తక్కువకు అమ్ముకున్న రైతులకు ఆ వ్యత్యాసాన్ని కూడా చెల్లిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. గుంటూరు మిర్చి యార్డ్‌లో 50 వేల మంది రైతులు ఈ పథకం కింద మిర్చి అమ్ముకొని పేర్లు నమోదు చేసుకొన్నారు. కానీ ఇంతవరకు ఏ రైతుకు ఒక్క పైసా చెల్లించింది లేదు. వ్యవసాయ అధికారులను అడిగితే ‘ఆ విషయాన్ని ఇక మర్చిపోండి’ అంటున్నారు.

గత ఐదేళ్లలో 2024 సంవత్సరంలోనే రైతులకు కొంత మిగులు వచ్చింది. సరాసరి కిలో రూ.360 అందింది. ఈ కాలంలో ఖర్చులన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ ధరలైతే రైతుకు బ్యారన్ కు కనీసంగా రూ.5 లక్షలు నష్టం వస్తుందని రైతులు ఆందోళన పడుతున్నారు. కానీ చంద్రబాబు కేజీ సరాసరి రూ.200 ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా వుంది. 100 రోజుల పోరాటం తర్వాత కూడా ధర రూ.200 రాలేదు. బేళ్ళు తిరిగి పంపేది కూడా సాధారణ మోతాదు కన్నా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి 50 శాతం అమ్మకాలు పూర్తి అయ్యేవి. కానీ ఇప్పటికి 20 శాతం మాత్రమే అమ్మకాలు జరగడాన్ని చూసి రైతులు ఆందోళన పడుతున్నారు.

కంపెనీలు తీసుకొన్న కోటా మేరకైనా కొనుగోళ్లు లేవు. ప్రభుత్వం కిమ్మనడం లేదు. జి.ఎస్‌.టి, ఎక్సైజ్‌ టాక్స్‌ 10 శాతం పెరిగాయని బీడీలు, సిగరెట్ల ధరలను కంపెనీలు 20 శాతం పెంచుకున్నాయి. రైతుల నష్టపోతున్నారు. కంపెనీలు లాభాలలో ఉంటున్నాయి. గత సంవత్సరం ఐటిసి కి రూ.7500 కోట్లు లాభం వచ్చినట్లు సమాచారం.

గత రెండు సంవత్సరాలుగా అసెంబ్లీ, పార్లమెంట్లలో వ్యవసాయ సంబంధితమైన అనేక బిల్లులు పాసయ్యాయి. అవన్నీ కూడా రైతులకు భారం పెంచి, కార్పొరేట్లకు లాభాలు పెంచాయి.

రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు లోనుగా సొసైటీకి ఇవ్వవచ్చు. పొగాకు బోర్డు తన దగ్గర ఉన్న డబ్బు నుంచి రూ.1000 కోట్లు లోన్‌ ఇవ్వవచ్చు. గతంలో పొగాకు కొనుగోలు సంక్షోభం వచ్చినప్పుడు సొసైటీ జయప్రదంగా రైతుల నుంచి పొగాకు కొని, అమ్మి మిగిల్చింది. ఇలాంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఢిల్లీ రైతాంగ పోరాటంలా సుదీర్ఘ పోరాటానికి పొగాకు రైతాంగం సిద్ధం కావాలి. కంపెనీలను, వాటిని కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలను వెనక్కి నెట్టేదాకా ఈ పోరాటం కొనసాగించాలి. వీరి ఆగడాలు సాగవని ఈ పోరాటం ద్వారా తెలియజేయాలి. అప్పుడే భవిష్యత్తులో వ్యవసాయం చేయగలుగుతాం.


వ్యాసకర్త - ఎ.పి రైతుసంఘం అధ్యక్షులు వి.కృష్ణయ్య

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్